నిర్మల్ చైన్‌గేట్, జూన్ 27 : నిర్మల్ జిల్లా వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28(నేటి) నుంచి మూడు రోజులపాటు 0 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 28వ తేదీన గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వేస్తారు. మొదటి రోజు వేసుకోని వారికి 29,30, జూలై 1 తేదీలలో వేస్తారు. జిల్లాలో సుమారు 92,116 మంది 0 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు.
ఇందుకు గాను 625 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 సంచార బృందాలు, 20 ట్రాన్సిట్ పాయింట్లు, 20 మంది వ్యాక్సిన్ మేనేజర్లు, 70 మంది సూపర్ వైజర్లు, వ్యాక్సినేటర్లు, వాలంటీర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అధికారులు, వైద్య సిబ్బందితో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్స్ పోలియోను విజయవంతం చేయాలని నిర్మల్ డీఎంహెచ్‌వో రాజేందర్ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో77,910 మంది చిన్నారులే లక్ష్యం : డీఎంహెచ్‌వో సాధన
ఎదులాపురం, జూన్ 27 ః ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సాధన కోరారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్స్ పోలియో వాల్ పోస్టర్, చుక్కల మందును ఆమె ఆవిషరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ఈ ఏడాది 77,910 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ 730 పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అదనంగా 27 రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా చుకల మందు వేయనున్నట్లు వివరించారు. జిల్లాకు 85,600 పోలియో డోసులు అందాయన్నారు. జూన్ 28న బూత్‌ల వద్ద పోలియో చుకలు వేయగా, ఆ రోజు తప్పిపోయిన చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుకల మందు వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఐవో డాక్టర్ వైసీ శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.