సుల్తాన్‌బజార్,ఆగస్టు 6: తెలంగాణలో పండుగల విషయంలో గందరగోళం జరుగకుండా ఒకే సిద్ధాంతం ప్రకారంగా పండుగలను నిర్ణయించడం వలన సిద్ధాంత అభిప్రాయాలు తొలుగుతాయని మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్, తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో తెలంగాణ అర్చక సమాఖ్య, భాగ్యనగర అర్చక పురోహిత సంఘం, భారతీయ తెలుగు ధృగ్గణీత పంచాంగ కర్తల సమాఖ్య సేవా సంఘం, చంఢీ పరమేశ్వరీ పీఠంల సంయుక్తాధ్వర్యంలో సిద్ధాంతి డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ, గట్టు శ్రీనివాసాచార్యుల సమన్వయ అధ్యక్షతన తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ధృక్ సిద్ధాం పంచాంగకర్తలు గొర్తి పట్టాభి సిద్ధాంతి, పీఎస్ఆర్ కృష్ణ, నిట్టల కృష్ణ ప్రసాద్, సీవీ అనంత, కర్ర వీరభద్రం, బిజుమల్ల శ్రీనివాస్ సిద్ధాంతితో తెలుగు రాష్ట్రాల సిద్ధాంతులు తదితరులు పాల్గొని ప్లవంగ నామ సంవత్సరం(2027-28), కీలక నామ సంవత్సరం(2028-29) రెండు సంవత్సరాలకు చెందిన పండు గల తేదీల నిర్ణయాలను శాస్త్ర బద్ధంగా పరిశీలించి ఏకగ్రీవంగా తీర్మానించారు.
పండుగల విషయంలో అయోమయం..
కొన్ని సంవత్సరాలుగా హిందువుల పండుగల తేదీల విషయంలో రెండు వేర్వేరు నిర్ణయాలు వెలువడటం వలన ప్రజలు, ఆలయాలు, అర్చకులు, ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, భక్తులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ఒకే పండుగను రెండు రోజు లలో నిర్వహించడం పట్ల ప్రజల్లో సందిగ్ధత ఏర్పడటమే కాకుండా పరిపాలనా ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.తాము రూపొందించే ధృక్ సిద్ధాంత పంచాంగాలలోని పండుగల నిర్ణయాలు భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగంలోని నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయని అన్నారు.
ఈ అన్ని విషయాలను ఒక తీర్మానంగా చేసి 2 సంవత్సరాల పండుగ నిర్ణయాలతో పాటు అన్ని విషయాలను కూలంకషంగా సభలో చర్చించి అందరి సమక్షంలో ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత పంచాంగకర్త ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర సిద్దాంతి, ప్రముఖ మహిళా జ్యోతిష్య పండితురాలు ద్వివేదులదేవి విజ్ఞాన సభలో తమ జ్యోతిష్యం ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్న 11 మంది తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలకు చెందిన సిద్ధాంతులను ఘనంగా సత్కరించారు.
త్వరలో సీఎం, మంత్రి దృష్టికి..
పండుగల విషయంలో నెలకొన్న గందరగోళాన్ని ఒకే సిద్దాంతం ప్రకారం నిర్ణయించడంతో సిద్దాంత అభిప్రాయాలు తొలుగుతాయని అన్నారు. ఈ విషయమై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ సభ్యులు పరాశరం రవీంద్రచార్యులు, డీవీఆర్ శర్మ, మోహన్ శర్మ,సతీష్ శర్మ,సంతోష్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.