హిమాలయ దేశం నేపాల్ కకావికలమైంది. ఆకస్మిక వరదలతో పెనువిధ్వంసం మిగిలింది. భూకంపానికితోడు, కొండచరియలు విరిగిపడటంతో హఠాత్తుగా పోటెత్తిన వరద బీభత్సం సృష్టించింది. భోటేకాశి, లెండే, త్రిశూలి నదుల ఉగ్రరూపంతో విధ్వంసపు తీవ్రత పెరిగిపోయింది. 157 మందికి పైగా చనిపోయారని, 750 మందికిపైగా గల్లంతయ్యారని భావిస్తున్నారు. వీరిలో భారతీయ పర్యాటకులూ ఉన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 26 : ప్రకృతి సోయగాలతో ఆకట్టుకొనే హిమాలయ దేశం నేపాల్‌లో బుధవారం జలప్రళయం సంభవించింది. హఠాత్తుగా పోటెత్తిన వరద బీభత్సం సృష్టించింది. నేపాల్కుపైనున్న టిబెట్‌లో మొదలైన ఆకస్మిక వరదలు సెంట్రల్ నేపాల్‌ను దాదాపు తుడిచిపెట్టాయి. ఈ క్రమంలో పలు గ్రామాలు, పట్టణాలు, కీలకమైన వంతెనలు, డజనుకుపైగా జల విద్యుత్తు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విలయంలో 157 మందికిపైగా మృత్యువాత పడగా, 750 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ పర్యాటక బోర్డు విడుదల చేసిన ప్రాథమిక జాబితా ప్రకారం 291 మంది విదేశీయులు, 193 మంది నేపాల్ జాతీయులు సహా 384 మంది పర్యాటకులు ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు.
వీరిలో 133 మంది భారతీయ పర్యాటకులు, 37 మంది ప్రవాస భారతీయ పర్యాటకులు ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా, మలేషియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ జాబితా ప్రాథమికమైనదని, ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ దీనిని ధ్రువీకరిస్తున్నామని పర్యాటక బోర్డు తెలిపింది. సంప్రదించడానికి వీలుపడని వారిలో అధిక సంఖ్యలో కైలాశ్ మానసరోవర్ యాత్ర కోసం టిబెట్‌కు వెళుతున్న యాత్రికులు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఖాట్మండుకు చెందిన టచ్ కైలాశ్ ట్రావెల్స్ అండ్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బాషు కుమార్ అధికారి మాట్లాడుతూ 93 మంది నేపాలీలతో సహా మొత్తం 390 మంది యాత్రికులు బుధవారం సరిహద్దు దాటాల్సి ఉందని తెలిపారు.

టిబెట్‌లో బుధవారం 8.37 గంటలకు సంభవించిన భూకంపం కారణంగానే ఆకస్మిక వరదలు సంభవించినట్టు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనల్ పార్లమెంట్‌కు తెలిపారు. భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపనల వల్ల మంచుకొండు విరిగిపడ్డాయని, దీంతో వరద పోటెత్తిందని వివరించారు. ఆ వరద భోటే కోశీ నదిలో కలిసి టిబెట్‌కు సరిహద్దున ఉన్న రసువా, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తిందని తెలిపారు. అదేసమయంలో టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లెండే నదిలో కొండచరియలు విరిగిపడటంతో నీటి మట్టం పెరిగి, ఆ నీరు కూడా భోటే కోశీ నదిలో చేరి దిగువనున్న త్రిశూలి నదిలోకి ప్రవేశించిందని జాతీయ విపత్తు నివారణ యాజమాన్యం సంస్థ వివరించింది. ఈ మూడు నదుల నీరు దాదాపు ఆరు జిల్లాలను కకావికలం చేసిందని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు భీతిగొలుపుతున్నాయి.
రాత్రి 10 గంటల సమయానికి 95 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 500 మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. కన్ని పట్టణాల్లో వరదతో కొట్టుకొచ్చిన బురద, మట్టి భవనాలను సగం వరకు ముంచెత్తింది. అంతా నిమిషాల వ్యవధిలో చూస్తుండగానే జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్ద పెద్ద భవనాలు, బహుళ అంతస్తులు, బస్టాండ్లు, వేల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ విపత్కర సమయంలో నేపాల్ ప్రజలు భారత ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడారు. భారత్ నుంచి ఇప్పటికే సహాయ సామగ్రిని తరలించినట్టు తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది ఉన్నట్టు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. నేపాల్ వెళ్లిన హైదరాబాద్, కర్నూలుకు చెందిన సుమారు 300 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలియవచ్చింది.

నేపాల్‌లోని టిబెట్ సరిహద్దు సమీపంలో ఉన్న ఉత్తర రసువా జిల్లాలో బుధవారం మెరుపు వరదలు సంభవించాయి. వరద నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటున్న బీహార్‌లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో టిబెట్ వైపు నుంచి బోటే కోషి నదిలోకి భారీ ప్రవాహం వచ్చి చేరడంతో టిమురే, శ్యాప్రుబేసి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. గ్యిరోంగ్ సరిహద్దు ప్రాంతం సమీపంలోని టిబెట్‌లో మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో కొందరు మరణించగా మరికొందరు గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. మెరుపు వరదలు సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. రసువాలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇది సంభవించి ఉండకపోవచ్చని నేపాల్ వరద అంచనా విభాగం తెలిపింది. అయితే టిబెట్ వైపు గణనీయమైన వర్షపాతం నమోదైనట్టు ఉపగ్రహ చిత్రాలు చూపించాయి.
కైలాస్ మానససరోవర్ యాత్రకు సంబంధించిన 384 మంది యాత్రికులు రసువాగధి సరిహద్దు ప్రాంతంలో బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు. ఈ యాత్రను రద్దు చేస్తూ నేపాల్ ప్రభుత్వం లేదా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రానున్న 48-72 గంటల పాటు యాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్టు ఖాట్మండులోని టూర్ ఆపరేటర్లు ధృవీకరించారు. నేపాల్ పర్యాటక బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం 384 మంది యాత్రికులు అదృశ్యమయ్యారు లేదా వారితో సంబంధాలు తెగిపోయాయి. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. వీరు కైలాస్ మానసరోవర్ యాత్ర కోసం బుధవారం టిబెట్‌లోకి ప్రవేశించాల్సి ఉంది.

తెలంగాణ ప్రాంత యాత్రికుల సమాచారం తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కంట్రోల్ రూంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాత్రికుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసేందుకు ఈ కంట్రోల్ రూంలో ముగ్గురు అధికారులను నియమించారు. ఎస్ లక్ష్మినారాయణ అసిస్టెంట్ సెక్రటరీ 9885371189, కే శ్రీనివాస్‌రెడ్డి సెక్షన్ ఆఫీసర్ 7997959754, ఈ చిట్టిబాబు సెక్షన్ ఆఫీసర్ 9440854433లో సంప్రదించాలని ప్రభుత్వం వెల్లడించింది.

సిటీబ్యూరో : హైదరాబాద్ నుంచి 153 మంది యాత్రికులు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నేపాల్ వెళ్లారు. వీరి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో అనారోగ్యం కారణంగా 16 మంది గదిలోనే ఉండగా, సందర్శనకు వెళ్లినవారి ఆచూకీపై తొలుత గందరగోళం నెలకొంది. అయితే వారు కూడా సురక్షితంగానే ఉన్నట్టు తెలిసింది. వరదలతో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో వివరాలు సేకరించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకుంది. ఆయన ఫోన్లో మాట్లాడుతూ.. మానసరోవర్ యాత్ర కోసం ఈ నెల 10న కుటుంబంతో కలిసి వెళ్లినట్టు తెలిపాడు. తన బృందంలో 153 మంది ఉన్నట్టు వివరించాడు. ఈ నెల 25న మానసరోవర్ యాత్ర ముగించుకొని పరిక్రమ యాత్రకు వెళ్లేందుకు సిద్ధం కాగా తమ బృందంలో కొందరు అస్వస్థతకు లోనవడంతో ఆగిపోయినట్టు వివరించాడు. మిగిలిన వారంతా పరిక్రమ యాత్రకు వెళ్లారని, వారంతా ఇప్పుడు చైనా ఇమిగ్రేషన ప్రాంతంలోని దార్సింగ్లో సురక్షితంగా ఉన్నారని చెప్పాడు.
నేపాల్‌లో చికుకున్న లేదా ఇబ్బందులు ఎదురొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అకడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న తమ వారితో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబసభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్, వందన మొబైల్: 9871999044, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ చక్రవర్తి మొబైల్: 9949351270, లైజన్ ఆఫీసర్ జీ రక్షిత్ నాయక్ మొబైల్: 9618597969