చెప్పినట్టు వినే ప్రభుత్వం ఉన్నదన్న అలసత్వమా? దౌర్జన్యం చేసినా మౌనంగా ఉండిపోతారన్న ధీమానా? బోర్డు, కేంద్రం తన గుప్పిట్లో ఉన్నాయన్న అహంకారమా? తెలంగాణతో నిత్యం నీటి కయ్యానికి దిగే ఏపీ.. నాగార్జున సాగర్‌పై మరోసారి రెచ్చిపోయింది. అక్రమంగా కుడికాలువకు నీటిని విడుదల చేసింది. కేఆర్ఎంబీ అనుమతి లేకున్నా, ఇరిగేషన్ అధికారులు అభ్యంతరపెట్టినా దౌర్జన్యంగా నీటిని మళ్లించుకున్నది. విద్యుదుత్పత్తి కోసమని నమ్మబలికి.. హెడ్‌రెగ్యులేటరీ గేట్లెత్తి, రైట్ కెనాల్‌కు నీటిని విడుదల చేసుకున్నది. ఇంతజరిగినా, రాష్ట్రప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూనే ఉండిపోయింది.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్ట్టు 26 (నమస్తే తెలంగాణ)/నందికొండ: తెలంగాణ సర్కార్ ఉదాసీనతను ఆసరాగా చేసుకొని మరోసారి నాగార్జున సాగర్ డ్యామ్‌పై ఏపీ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) అనుమతి లేకుండా, కనీస ముందస్తు సమాచారం లేకుండా నీటిని తరలించుకుపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా బుధవారం ఉదయం 11 గంటలకు నీటిని విడుదల చేశారు.
ఈ నీరు తాగునీటి అవసరాలకా?..సాగునీటి అవసరాలకా..?అనేది కూడా ఏపీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఏపీ ఇరిగేషన్ ఎస్ఈ, స్థానిక అధికారులు డ్యామ్‌పైకి వచ్చినట్టు తెలుస్తున్నది. వీరు కుడికాలువకు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్టు అక్కడ ఉన్న డ్యామ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే కేఆర్ఎంబీ అనుమతులున్నాయా అని ప్రశ్నించగా లేవని, అవసరం కూడా లేదన్నట్టు నిర్లక్ష్యంగా బదు లిచ్చారు. ఇదే సమాచారాన్ని ప్రాజెక్టు సీఈకి, ఇతర అధికారులకు డ్యామ్ సిబ్బంది తెలిపారు. దీంతో హెడ్ రెగ్యులేటరీ నుంచి నేరుగా కుడి కాలువకు నీ టిని విడుదల చేయకుండా వెనుదిరిగారు.
ఆ తర్వా త ఎప్పటిలాగే తమ దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. సా గర్ రైట్‌బ్యాంక్ వైపు డ్యామ్ దిగువన ఉన్న కుడికాల్వ మీద విద్యుదుత్పత్తి కేంద్రానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. అక్కడి నుంచి కుడికాలు వ గేట్లను ఆపరేట్ చేస్తూ పవర్ జనరేషన్ కోసం స్విచ్ ఆన్ చేసి గేట్లు ఎత్తారు. దీంతో కరెంటు ఉత్పత్తి ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని కుడికాలువలోకి వి డుదల చేశారు. వాస్తవానికి నాగార్జునసాగర్‌లో 530 అడుగులకు పైన ఉంటేనే కుడి కాలువ ద్వారా, 548 అడుగులకు పైగా ఉంటే ఎడమకాల్వ ద్వారా విద్యుదుత్పతికి అవకాశం ఉన్నది. బుధవారం ఉ దయం 9గంటలకు నీటిమట్టం 536.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఏపీ అధికారులు పవర్ జనరేషన్ పేరుతో కుడికాలువకు 2053 క్యూసెక్కుల ను అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. దీన్ని క్రమంగా పెంచనున్నట్టు సమాచారం. డ్యామ్ పూర్తిగా సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉన్నా సరే.. నీటి చౌర్యానికి దిగడం కలకలం రేపుతున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఎడమకాలువకు తాగునీటి పేరుతో…
ఏపీ అధికారులు కుడికాలువ ద్వారా నీటిని తరలిస్తుంటే తెలంగాణ అదికారులు ఎడమకాలువకు మధ్యాహ్నం నీటిని విడుదల చేశారు. కేవలం 418 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఆ నీటితోనే త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ను మాత్రమే నింపుతామని ప్రకటించారు. దీంతో ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎడమ కాలువ కింద చెరువులు, కుంటలు నింపాలన్న డిమాండ్ పక్షం రోజులుగా వినిపిస్తున్న ది. పలుచోట్ల రైతులు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. మంగళవారం కోదాడలో, బుధవారం నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
స్వయంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న హు జూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలు పూర్తిగా సాగ ర్ ఆయకట్టు పరిధిలోకే వస్తాయి. ఇక్కడి రైతులు సైతం నీళ్ల కోసం రోడ్లెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారుల తీరును ఆసరాగా చేసుకొని ఎడమకాలువకు సైతం నీటిని తరలించి చెరువులు, కుం టలు నింపే అవకాశం లభించిందన్న వాదన వినిపిస్తున్నది. అయినా సరే తెలంగాణ ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందన్నది స్పష్టత లేదు. ఏదో పేరుకు ఏపీ వాళ్లు నీళ్లు తీసుకుపోతున్నారు కాబట్టి తాము కూడా పోటాపోటీగా ఎడమకాలువకు నీటిని విడుదల చేసామని అనిపించుకోవడం ఎందుకన్న ప్రశ్న లు వస్తున్నాయి. ఇదే అదునుగా ఎడమకాలువ ఆయకట్టులోని పంటలను రక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాగునీటి వినియోగంలోనూ నిర్లక్ష్యం.
నిరుడు తాగునీటి అవసరాల కోసం ఏపీకి కేఆర్ఎంబీ కేటాయించిన 10 టీఎంసీల నీటిని వాళ్లు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కానీ తెలంగాణకు తాగునీటి కోసం కేటాయించిన 15.90 టీఎంసీలలో కేవలం 8.5 టీఎంసీలే వినియోగించారని తెలిపారు. ఇంకా 7.4 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా తెలంగాణ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఏపీ కృష్ణా జలాలను వినియోగించుకునే అవకాశం లేకు న్నా, కేఆర్ఎంబీ ఆదేశాలు లేకున్నా దౌర్జన్యంగా కు డి కాలువకు నీటి విడుదల చేపట్టడంతో పరిస్థితి ఏం దనేది స్పష్టం అవుతున్నది. తాజా పరిస్థితిపై సాగర్ ప్రాజెక్టు అధికారులు స్పందిస్తూ.. నిరుడు వేసవిలో తాగు నీటి కోసం రాష్టానికి కేటాయించిన వాటాలో మిగిలిన నీటిని వాడుకునేందుకే బుధవారం ఎడమకాలువకు నీటిని విడుదల చేసినట్టు ప్రకటించారు.
ఇదే సమయంలో ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసిన పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఎడమకాలువ ద్వారా పెద్దదేవులపల్లి చెరువును నింపేందుకు రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పన 5 రోజుల పాటు ఒక టీఎంసీ నీటిని తరలిస్తామని వెల్లడించారు. అయితే ఈ నీరు కేవలం తాగునీటి అవసరాలకేనంటూ సాగునీటికి ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని హెచ్చరించారు. కాగా సాగర్‌లో బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి నీటిమట్టం 536.60 అడుగులు, నీటి సామర్థ్యం 181.3178 టీఎంసీలకు చేరుకున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా 23, 341 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా కుడికాలువ పవర్ హౌస్ ద్వారా 2,053, లెఫ్ట్ కెనాల్ ద్వారా 418 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 4471 క్యూసెక్కులు అవుట్ ఫ్లోగా నమోదైంది.
గతంలోనూ ఏపీ దౌర్జన్యకాండ
రాష్ట్ర విభజన సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ నిర్వహణలో, శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. అయితే శ్రీశైలం పూర్తిగా ఏపీ పరిధిలోనే కొనసాగతుండగా, సాగర్ మాత్రం అటూ ఇటూ కాకుండా పోయింది. సాగర్ ప్రాజెక్టులోని మొత్తం 26 క్రస్ట్‌గేట్లకు గానూ 13 గేట్ల నిర్వహణ, కుడికాలువ నిర్వహణ తమదేనంటూ పలుమార్లు దౌర్జన్యానికి దిగింది.
డ్యామ్ భద్రతా విధుల్లో ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను కాదంటూ ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులు చొచ్చుకొని వచ్చారు. డ్యామ్‌పైన బారికేడ్లను అడ్డుపెట్టి తెలంగాణ పోలీసులు, ఇరిగేషన్ అధికారులను కుడివైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో కేసీఆర్ సర్కార్ కూడా దీటుగా స్పందించి ఏపీ కు ట్రలను తిప్పికొట్టింది. తర్వాత కొద్దికాలం బాగానే ఉన్నా 2023 నవంబర్‌లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు మరోసారి ఏపీ ప్రభు త్వం కుడికాలువకు నీళ్లు విడుదల చేసుకుంటామంటూ రాష్ట్ర పోలీసులు, అధికారులపైకి దాడి కి దిగారు. అప్పటికే తిప్పికొట్టే ప్రయత్నం చేసి నా ఏపీ వెనక్కి తగ్గలేదు.
ఇదే అదనుగా కేంద్రం డ్యామ్‌ను సీఆర్పీఎఫ్ ఆధీనంలోకి తెచ్చింది. అప్పటినుంచి ఇరువైపులా వాళ్లే కాపలాకాస్తున్నాయి. కేవలం కొద్దిమంది ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు మాత్రమే డ్యామ్‌పైకి వెళ్లే అవకాశమిచ్చారు. తాజాగా సీఆర్పీఎఫ్ భద్రతలో ఉన్నప్పటికీ కుడి కాలువకు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే మున్ముందు నీళ్లు మొత్తం తరలించుకుపోయినా ఆశ్చర్యం లేదేమో. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ దిగువకు చుక్కనీరు రాకుండా అడ్డుకుంటున్న ఏపీ, మున్ముందు సా గర్పైనా పట్టుబిగిస్తే ఇక కృష్ణా జలాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న చర్చ నడుస్తున్నది.