హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలకు కీలకంగా పనిచేస్తున్న జీపీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాల్లో కాంగ్రెస్ సర్కార్ భారీగా కోతలు పెడుతున్నది. ఒక్కో ఆపరేటర్‌కు రూ.26,805 కేటాయింపు ఉండగా, చేతికి మాత్రం కేవలం రూ.17,437 అందిస్తున్నది. రాష్ట్రంలో 1,773 మంది ఆపరేటర్ల కోసం రాష్ట్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.57.13 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ప్రతిపాదించారు. ఈ లెకల ప్రకారం ఒకో ఆపరేటర్‌పై నెలకు రూ.26,805 వ్యయం చూపుతుండగా.. వారిచేతికి అందుతున్నది మాత్రం రూ.17,437గా ఉన్నది. అంటే కేటాయించిన మొత్తంతో పోలిస్తే రూ.9,368 కోత పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం జీపీ కంప్యూటర్ ఆపరేటర్‌కు నెలకు రూ.19,500 బేసిక్ రెమ్యునరేషన్‌గా లెకించింది. దీనికి పీఎఫ్, ఈఎస్ఐ, సర్వీస్ చార్జీలు, ఏజెన్సీ కమీషన్, జీఎస్టీ తదితరాలను కలిపి ఒకో ఆపరేటర్‌పై నెలకు సుమారు రూ.26,805 వ్యయం అవుతున్నట్టు చెల్లింపు లెకల్లో చూపుతున్నారు.
కానీ, ఆపరేటర్ ఖాతాలో జమ అవుతున్న నికర మొత్తం రూ.17,437 మాత్రమే ఉంటున్నది. పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఈ ఏడాది జూలై 17న ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో 1,773 మంది కంప్యూటర్ ఆపరేటర్ల కోసం 2026-27లో రూ.5,713.55 లక్షలు అవసరమని పేరొన్నారు. నెలవారీ లెకన ఒకో ఆపరేటర్‌కు రూ.26,805 చొప్పున ఈ మొత్తం వ్యయం చూపించారు. 1,773 మందికి నెలకు రూ.19,500 చొప్పున 12 నెలలకుగాను రూ.4,148.82 లక్షలు అవుతుందని తెలిపారు. 13 శాతం ఈపీఎఫ్ కింద రూ.539.35 లక్షలు, 3.25 శాతం ఈఎస్ఐ కింద రూ.134.84 లక్షలు, 3 శాతం ఏజెన్సీ కమీషన్ కింద రూ.124.46 లక్షలు, 18 శాతం జీఎస్టీ కింద రూ.890.54 లక్షలు వ్యయం అవుతున్నదని పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.57.13 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఆరు నెలలకు సంబంధించిన నిధులు కూడా విడుదలైనట్టు తెలిసింది. కానీ తమకు ఏప్రిల్ నుంచి వేతనాలు అందడం లేదని జీపీ ఆపరేటర్లు వాపోతున్నారు.
ఒక్కో ఆపరేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న మొత్తం వ్యయం రూ.26,805 నుంచి రూ.9,368 కోత అంటే సుమారు 34.95 శాతం ఆపరేటర్ చేతికి వెళ్లడం లేదు. అయితే ఈ మొత్తాన్ని పూర్తిగా జీతం కోతగా పరిగణించలేమని అధికారులు చెప్తున్నారు. ఇందులో ఉద్యోగి పీఎఫ్, ఈఎస్ఐతోపాటు యాజమాన్య వాటాలు, సర్వీస్ చార్జీలు, ఏజెన్సీ కమీషన్, జీఎస్టీ తదితర చార్జీలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయినప్పటికీ ఆపరేటర్‌కు కేటాయిస్తున్న మొత్తం ఎంత? అతడి చేతికి వస్తున్నది ఎంత? అనే ప్రశ్న మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ లెకల్లోనే 3 శాతం ఏజెన్సీ కమీషన్ కోసం రూ.124.46 లక్షలు కేటాయించారు. అంటే మధ్యవర్తి ఏజెన్సీకి కూడా ప్రభుత్వ నిధుల నుంచే భారీ మొత్తం వెళ్తున్నది. గ్రామస్థాయిలో కంప్యూటర్ సేవలు అందించే ఉద్యోగికి మాత్రం చివరికి తకువ మొత్తం మిగులుతున్నది. ఉద్యోగి పని చేస్తాడు.. ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. మరి మధ్యలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి కమీషన్ ఎందుకని ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేస్తామమని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థలు ఉండనివ్వబోమని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వేతనాలు ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేస్తున్నారు.
లెకల్లో 18 శాతం జీఎస్టీ కింద రూ.890.54 లక్షలు చూపించారు. ఒకో ఆపరేటర్ వ్యయంలో జీఎస్టీతోపాటు ఇతర చార్జీలు కలువడంతో ప్రభుత్వం కేటాయించే మొత్తం పెరుగుతున్నది. కానీ ఉద్యోగి చేతికి వచ్చే నికర వేతనం మాత్రం పెరుగడం లేదు. గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు, డిజిటల్ రికార్డులు, పన్నుల వసూళ్లు, ప్రభుత్వ పథకాల డాటా నిర్వహణ వంటి కీలక బాధ్యతలు జీపీ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. అన్ని పనులు తమతోనే చేయిస్తూ పని భారం పెంచుతున్న అధికారులు వేతనాల చెల్లింపు విషయంలో కోతలు పెట్టడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆపరేటర్లకు చేతికి అందిన మొత్తం రూ.19,750గా ఉండేదని చెప్తున్నారు. కాలం గడిచేకొద్ది జీతం పెరుగాల్సిందిపోయి తగ్గించడమేందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆపరేటర్ల వేతనాల విషయంలో బడ్జెట్ కేటాయింపులు భారీగా చూపిస్తూ.. ఉద్యోగి చేతికి మాత్రం తకువ మొత్తం ఇవ్వడం ఏ రకమైన న్యాయమని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
బేసిక్ వేతనం : రూ.19,500
13 శాతం ఈపీఎఫ్ రూ.1,950
3.25 శాతం ఈఎస్ఐ రూ.488
3.99 శాతం ఏజెన్సీ కమీషన్ రూ.778
8 శాతం జీఎస్టీ రూ.4,089
అన్ని కలిపి మొత్తం రూ.26,805
ఈపీఎఫ్ ఎంప్లాయి వాటా (12%) రూ.1800
ఈఎస్ఐ ఎంప్లాయి వాటా (0.75%) రూ.113
వృత్తి పన్ను రూ.150
మొత్తం కోతలు రూ.2,063
చేతికి అందుతున్నది. రూ.17,437