హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ‘ఎథిక్స్ కమిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షంపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బలిచేసేందుకు కుట్రలు చేస్తున్నది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిండు శాసనసభలో బడివే, పండబెట్టి తొక్కుతా, బట్టలూడదీసి కొడుతా, మా దగ్గర కండలు తిరిగినోళ్లున్నరు.. బోర్ల వేసి కొడ్తం.. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ‘అరేయ్ తోలుతీస్తా, బయట తిరుగనివ్వను’ అని దానం నాగేందర్, ‘పరికత్తులు లేస్తే మీ తలలు తెగుతయ్.. కత్తులతో కోలాటమాడుతా’ అని మందుల సామేల్ బెదిరింపులు, ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ అసభ్య సైగలు ఎథిక్స్ కమిటీ కిందికి రావా? అని సూటిగా ప్రశ్నించారు. వారు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టల వీడియోలు చూపుతూ ధ్వజమెత్తారు.
బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, ముఠా గోపాల్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి ప్రవర్తనపై చర్చించి చర్యల సిఫార్సుకు ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటుచేసినట్టు నోటీసు వచ్చిందని, అయితే కౌశిక్ వ్యవహారాన్ని సిఫార్సు చేసిన సమయంలో ఎథిక్స్ కమిటీ మనుగడలో లేదని తెలిపారు. అసలు కమిటీ లేనప్పుడు ఆ వ్యవహారాన్ని ఎలా రెఫర్ చేస్తారని ప్రశ్నించారు. దీనిని బట్టి కక్ష సాధింపు చర్యగా అర్థమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కడియం శ్రీహరి అదే ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కౌశిక్ ఆక్షేపించారని తెలిపారు.
ఫిరాయింపుదారులను ప్రశ్నించకుండా ఉండేందుకే కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ముసుగులో కుతంత్రానికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సంకేతాలివ్వడం ఆక్షేపణీయమన్నారు. ఎథిక్స్ విషయంలో అధికార కాంగ్రెస్‌కు ఓ న్యాయం.. ప్రతిపక్ష బీఆర్ఎస్కు మరో న్యాయమా? అని నిగ్గదీశారు. చట్టసభల్లో హుందాగా వ్యవహరించాల్సిన సీఎం, వీధిరౌడీలా బజారు భాష ఉపయోగించారని, హోంమంత్రిగా పనిచేసిన సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి.. ఆమె మాటలు విన్నవారు జూబ్లీ బస్‌స్టాండ్‌లో బిచ్చం అడుక్కోవాల్సి ఉంటుందని అవమానించిన విషయాలను ఉటంకించారు. ఎథిక్స్ కమిటీకి చిత్తశుద్ధి ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడిన సీఎంను ముందుగా పిలువాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించుకొని కండువాలు కప్పిన సీఎం రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు, హైకోర్టులు మొట్టికాయలు వేసినా స్పందించని ప్రభుత్వానికి ఎథిక్స్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని నిలదీశారు. నిండుసభలో బూతులు మాట్లాడిన సీఎంపైనే మొదట చర్యలకు ఉపక్రమించాలని ఎథిక్స్ కమిటీని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించాలని రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో రేవంత్ సర్కార్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంటే ఎందుకు స్పందించడంలేదని వేముల ప్రశ్నించారు. ‘ఢిల్లీలో రాజ్యాంగ రక్షణ.. తెలంగాణలో భక్షణ’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వనీతికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచడం కాదు.. ఆచరణలో చేసి చూపాలని డిమాండ్ చేశారు.
‘పైనున్నోడు లక్షల కోట్లు తింటున్నడు.. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న పేదలకు ఇచ్చేందుకు పైసల్లేవు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్న మాటలను వేముల ఉటంకించారు. పైన ఉన్నోడు అంటే ముఖ్యమంత్రి కాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే కోమటిరెడ్డి ఆరోపణలపై ఏసీబీ లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ‘మేఘారెడ్డి పైసలిచ్చి టికెట్ తెచ్చుకున్నాడని చిన్నారెడ్డి చెప్పారు. ఆయన పైసలు ఎవరికి ఇచ్చిండు. అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్నది రేవంత్‌రెడ్డే కదా. ఆయన పైసలు తీసుకొని టికెట్ ఇచ్చింది బహిరంగ రహస్యమే కదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ పదవి రూ.50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలను గుర్తుచేశారు.
మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి సోదరుడిపై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని వేముల డిమాండ్ చేశారు. ‘ ఉద్యోగులు, వ్యాపార టర్నోవర్‌లేని టెసెరాక్ట్ అనే కంపెనీకి రూ. 200 కోట్ల భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టారని ఆమె బయట పెట్టారు. గతంలోనూ సీఎం సన్నిహితుడైన ఒక నేత డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధి కణతకు తుపాకీపెట్టి బెదిరించారని ఆరోపించిన విషయాలను గుర్తుచేశారు. మరి నైతిక విలువల గురించి మాట్లాడే రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆయనపై సుస్మిత చేసిన ఆరోపణలపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
22ఏ సెక్షన్ కింద రాష్ట్రంలోని 1.20 కోట్ల ఎకరాలను నిషేధ జాబితాలో చేర్చి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నదని వేముల ఆరోపించారు. 40-50 ఏండ్ల కిందట కష్టపడి కొనుగోలు చేసిన భూములు, ప్లాట్లు 22ఏ లో చేర్చడం దుర్మార్గమని మండిపడ్డారు. నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ నేతలు బ్రోకర్ల అవతారమెత్తి ప్రజల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్‌లోనూ భూదోపిడీకి స్కెచ్ వేశారని విమర్శించారు. హైడ్రా పేరిట బ్లాక్ మెయిల్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు బీఆర్ఎస్ సభ్యుల గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి సర్కార్ పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
కాంగ్రెస్ మూడున్నరేండ్ల పాలనలో అన్నిరంగాలు కుంభకోణాలకు నిలయంగా మారాయని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు, సోలార్, ఇసుక, ఓబీ టెండర్లతోపాటు హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతులకు బిల్డర్ల వద్ద ఆర్ ఆర్ ట్యాక్స్ బహిరంగంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సేకరించిన 14 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపి పల్లీ బఠానీల లెక్క అమ్ముకుంటున్నారని విరుచుకుపడ్డారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు ముసుగులోనూ భూదందాలు నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని దెప్పిపొడిచారు.
రేవంత్ క్యాబినెట్ సహచరులు కమీషన్ల మంత్రులుగా మారారని వేముల దెప్పిపొడిచారు. ఇటీవల రిటైర్డ్ మహిళా ఉద్యోగి బెనిఫిట్స్ కోసం తనను 12 శాతం కమీషన్ అడిగారని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ‘అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రెవెన్యూశాఖలో 30 శాతం కమీషన్లు నడుస్తున్నాయని, ఆంధ్రా అధికారుల హవా నడుస్తున్నదని చేసిన ఆరోపణలను గుర్తుచేశారు. రేవంత్ క్యాబినెట్‌లోని మంత్రులను ప్రజలు 15 శాతం, 30 శాతం కమీషన్ మంత్రులని పిలుచుకుంటున్నారని