TVK Vijay : తమిళనాడులో విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు దీనిపై బుధవారం కూటమి నేతలు సంయుక్తంగా ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది.
అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మద్దతు లేకపోవడంతో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, ఎండీఎంకే పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇంతవరకు ఈ కూటమికి పేరు లేదు. దీంతో తమ కూటమికి పేరు పెట్టాలని నేతలు నిర్ణయించారు. బుధవారం చెన్నై, పనైయూర్‌లోని టీవీకే కార్యాలయంలో టీవీకేతోపాటు ఇతర కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. చర్చల అనంతరం తమ కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయెన్స్ అనే పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తమ కూటమి లౌకిక వాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందనే విషయాన్ని చాటేలా ఈ పేరును నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.
ఈ సమావేశానికి టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వం వహించారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ మాణిక్కం ఠాగూర్, తరగాయ్ క్యాత్బర్ట్, ప్రవీణ్ చక్రవర్తి, వీసీకే నుంచి ఆ పార్టీ అధినేత తిరుమవలవన్, వన్నీ అరసు, రవి కుమార్, సింధనాయ్ సెల్వన్, ఎండీఎంకే లీడర్ వైకో, దురయ్ వైకో, ఐయూఎంఎల్ నుంచి కేఎం కాదర్ మొహిదీన్, షాజహాన్ హాజరయ్యారు. రాబోయే అనేక ఎన్నికల్లో కూడా కూటమిగా వెళ్లాలని ఆయా పార్టీల నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.