హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : 22ఏ బాధితులు ఆందోళనపడొద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే సామాన్యుల ఆస్తులను కాపాడేందుకు రాజీలేని పోరాటం చేస్తామని హరీశ్‌రావు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత, హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధ జాబితాలో చేర్చిన భూములన్నింటినీ తక్షణమే రాత్రికి రాత్రే తొలగించకపోతే సెప్టెంబర్ 7న అసెంబ్లీని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే బాధితులందరినీ ఏకం చేసి సెక్రటేరియట్ ముట్టడిస్తామని తేల్చిచెప్పారు. ఢిల్లీలో నీట్ విద్యార్థుల పోరాటం తరహాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
బుధవారం కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ ఎన్ఆర్ఎస్ఏ కమ్యూనిటీ హాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన 22ఏ బాధిత కుటుంబాల ఆవేదన సదస్సులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల గోడు విన్న హరీశ్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న సామాన్యులు కబ్జాదారులా? లేక ప్రజల హక్కులను లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అసలైన కబ్జాదారా? అని నిలదీశారు. అసలు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 22ఏ ఆంక్షలను తీసుకొచ్చింది? ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, ఉద్యోగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం.. వాటిని గాలికొదిలేసి కేవలం భూముల చుట్టూ ఎందుకు తిరుగుతున్నదని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగిందని, కానీ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం భూములే కేంద్రంగా పరిపాలన సాగుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ ఆలోచనలన్నీ ప్రజల సంక్షేమం, కల్యాణలక్ష్మి, అసరా పెన్షన్లు, బస్తీ దవాఖానలు, 24గంటల ఉచిత కరెంట్, తాగునీటి చుట్టూ తిరిగితే.. రేవంత్‌రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూములను అమ్ముకోవడం చుట్టూనే తిరుగుతున్నాయని అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో హౌసింగ్‌బోర్డుకు చెందిన ఒక గజం భూమిని కూడా అమ్మకానికి పెట్టలేదని, కానీ రేవంత్ రాగానే సుమారు రూ.30వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తెగనమ్మేశారని ఆరోపించారు.
నాడు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఎన్నో ఐటీ కంపెనీలు, పెట్టుబడులు తరలివచ్చాయని, ఇవాళ రేవంత్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో ఆ ఇమేజ్ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని హరీశ్‌రావు దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెట్టే ధైర్యం చేయడం లేదని చెప్పారు. మొన్న మలాజిగిరి, మేడ్చల్, నిన్న కుత్బుల్లాపూర్, ఇవాళ కూకట్పల్లి.. ఎకడికి వెళ్లినా వేలాది మంది 22ఏ బాధితులు తమ ఆవేదన వెళ్లగకుతున్నారని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీపావళికి ప్రతిపక్షాలపై బాంబులు వేస్తానని చెప్పి.. అమాయక పేద ప్రజలపై 22ఏ అనే అతిపెద్ద బాంబు వేశారని హరీశ్‌రావు చురకలంటించారు. ప్రజల సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఆయన బెదిరింపులకు భయపడే వాళ్లు బీఆర్ఎస్లో ఎవరూలేరని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి సతీశ్‌రావు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రా అధికారులు దౌర్జన్యంగా నీటిని తరలిస్తున్నా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేటాయింపులపై త్రిసభ్య కమిటీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకున్నా, అనుమతుల్లేకుండా నీటిని ఏపీ తరలిస్తుంటే కేఆర్ఎంబీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేతగాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని, మరోవైపు సాగర్ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రెండేండ్లుగా కృష్ణా జలాల్లో మనకు దకాల్సిన తాతాలిక వాటాను కూడా వినియోగించుకోకుండా ఏపీకి ధారాదత్తం చేశారని, చరిత్రలో ఎన్నడూ లేనంత తకువగా నీటిని వినియోగించి రాష్ర్టానికి రేవంత్ సర్కార్ ద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. రాష్ర్టానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని, తెలంగాణ జల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆయనపై కూడా ఉన్నదని స్పష్టంచేశారు. 8మంది ఎంపీలు రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : వీఆర్ఏ వారసుల ఉద్యోగాల అంశాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తుతానని హరీశ్‌రావు జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు. జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులు ఆధ్వర్యంలో హరీశ్‌రావును హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిశారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 ఆధారంగా 61 ఏండ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. డెత్ గ్రాట్యుటీ ఇవ్వకుండా, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ కోకాపేటలోని నివాసంలో హరీశ్‌రావును మాడల్ స్కూల్ టీచర్లు కలిసి సమస్యలు చెప్పుకొన్నారు. 2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై, ప్రాణాలు కోల్పోయిన 40మంది ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని హరీశ్‌రావు కోరారు. పెండింగ్‌లో ఉన్న 3వేల మంది టీచర్ల ఐదు డీఏలు ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు, మాడల్‌స్కూల్ టీచర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసానిచ్చారు.