రియల్ ఎస్టేట్ వ్యాపారి అమాయక ప్రజలను నిండా ముంచాడు. పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కొంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు. మరికొంత మంది భవిష్యత్‌లో తమ సంతానానికి ఉపయోగపడుతుందని ప్లాట్లలో పెట్టుబడి పెట్టారు. వారి ఆశలను రియల్ ఎస్టేట్ వ్యాపారి నీరు గార్చాడు. కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు పోతాయని తెల్సినా ఆదరబాదరాగా వెంచర్ చేసి, తక్కువ ధరకు ప్లాటు అమ్ముతామని ప్రచారం చేసుకున్నాడు. అమాయక ప్రజలు నమ్మి మోసపోయారు. జరిగిన అన్యాయాన్ని గుర్తించి, వ్యాపారిని నిలదీస్తే ఇటు డబ్బులు ఇవ్వలేదు. అటు మరో ప్లాటు ఇవ్వలేదు. ఆరేళ్లుగా అతడి చుట్టూ తిరిగి వేసారిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
– ఆగస్టు 6
మేడ్చల్ మండలంలోని రావల్కోల్ రెవెన్యూ పరిధిలోని గూడెంగడ్డ తండాలో నగరంలోని చింతల్‌కు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి 206 తదితర సర్వే నెంబర్లలో భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఎస్ఆర్ పేరుతో వెంచర్ చేశాడు. ఒక్కో ప్లాటును 135 గజాల చొప్పున మొ త్తం 75 ప్లాట్లు చేశాడు. గజం రూ.5వేలుగా ధర నిర్ణయించాడు. నగరానికి దగ్గరగా ఉన్న రావల్‌కోల్‌లో ప్లాటు కొనుగోలు చేసే భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని, మం చి ధర పలుకుతుందని భావించిన స్థానికేతరులు ఒక్కో ప్లాటుకు రూ.6.55 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. అయితే ప్లాట్లు గా మార్చిన భూమి కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం సేకరించింది. 75 ప్లాట్లలో 40 ప్లాట్లు కాళేశ్వరం కాల్వలో పరిధిలోకి వెళ్లాయి. ఒక్కో ప్లాటుకు రూ.6.55 లక్షలు అంటే మొత్తం 40 ప్లాట్లకు సంబంధించి రూ.2.62 కోట్లు బాధితులు కోల్పోయారు.
ఆరేళ్లుగా బాధితుల ప్రదక్షిణలు
ఆరేళ్ల నుంచి ప్లాట్లు కోల్పోయిన బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఇస్తానని, అదే ప్రాంతంలో వేరేచోట్ల ప్లాటు ఇస్తానని చెపుతూ మభ్యపెడుతూ వస్తున్నాడు. కానీ బాధితులకు డబ్బు, ప్లాట్లు ఇవ్వలేదు. విసిగి వేసారిపోయిన బాధితులు గురువారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సుభాష్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2019లోనే నోటిఫికేషన్
గూడెంగడ్డ తండాలోని పలు సర్వే నంబర్లలో ఉన్న భూమి కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల కోసం సేకరించేందుకు 2019లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భూ యాజమానులకు నోటీసులు ఇచ్చింది. ఈ విషయం తెలిసినప్పటికీ సుభాష్ రెడ్డి తన భూమిని 2020లో వెంచర్‌గా మార్చి ప్లాట్లు విక్రయించారని బాధితులు తెలిపారు. ప్లాట్లు చేసి, అమాయకుల నుంచి డబ్బులు దండుకోవడమే కాకుండా భూ సేకరణలో తన భూమి పోయిందని దరఖాస్తు చేసుకొని రూ.28,30,562 పరిహారాన్ని కూడా పొందాడు.