నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 11 : రైతులకు అండగా నిలుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచుతున్నదని, కరెంట్ కోతలతో చుక్కలు చూపిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయానికి 8గంటల కరెంట్ మాత్రమే ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆందోళన బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిందని, ఇప్పుడెందుకు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో 765 డీజీ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. నారాయణరావు పేట మండలం గుర్రాలగొందిలో సిద్దిపేట- సిరిసిల్ల రహదారిపై, నారాయణరావుపేటలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట, హుస్నాబాద్ విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట మహ్మదాపూర్ రైతులు ధర్నా నిర్వహించారు.

సిద్దిపేట మండలం రాఘవాపూర్ స్టేజీ వద్ద సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై, మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట వద్ద రైతులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో రైతులు బైక్ ర్యాలీ నిర్వహించి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లోని సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ మోటర్లతో ఆందోళన చేపట్టారు. కోరుట్ల మండలం పైడిమడుగు రైతులు సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు.

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి చౌరస్తాలో సుందరగిరి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి రైతులు పోరుకు దిగారు. మక్కజొన్న, పత్తి కర్రలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో, ఇటిక్యాల మండలం సాతర్లలో, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులో, నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తుర్కదిన్నె విద్యుత్ సబ్‌స్టేన్లను అన్నదాతలు ముట్టడించారు. కోడేరులో బీఆర్ఎస్ నాయకులు, రైతులకు మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో మూడో రోజూ రైతులు ఆందోళనకు దిగారు. ఇసాయిపేట సబ్‌స్టేషన్ ఎదుట పోతారం, ఇసాయిపేట గ్రామాల రైతులు బైఠాయించారు.

రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు బైఠాయించారు. పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. అటు దోమకొండ మండలం సీతారాంపల్లిలో సబ్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలోని సబ్ సేష్టన్ను ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. రైతులు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న క్రమంలో ట్రాన్స్‌కో ఏడీఏ ఎల్లంపేట సబ్‌స్టేషన్‌కు రావడంతో రైతు గండి మహేశ్ ఆయన కాళ్లు మొక్కి కోతలు లేకుండా చూడాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోత్తపేట సబ్ స్టేషన్ ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.