Zaheerabad Railway Station | జహీరాబాద్, అక్టోబర్ 5 : 70 ఏళ్ల చరిత్ర కలిగిన జహీరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపికై రూ.20 కోట్లతో ఆధునిక హంగులతో ముస్తాబవుతోంది. పనులు తుది దశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ఎంపిక నుంచి అభివృద్ధి వరకు:
దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. తెలంగాణలో 39 స్టేషన్లకు అవకాశం దక్కగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్దదైన జహీరాబాద్ కు చోటు లభించింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వికారాబాద్-పర్లీ మార్గంలో ఈ స్టేషన్ కీలకం. రోజూ 18 ప్యాసింజర్, 12 గూడ్స్ రైళ్లు, వెయ్యి మందికి పైగా ప్రయాణికుల రాకపోకలతో సందడిగా ఉంటుంది.
కోట బురుజులతో స్వాగతం:
స్టేషన్ ముఖద్వారమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జహీరాబాద్ చరిత్రకు ప్రతీక అయిన కోట బురుజుల తరహాలో ఎర్ర ఇటుక కంగురాలతో ఆర్చ్ ను నిర్మించారు. స్టేషన్ ప్రహరీ గోడ కూడా అదే డిజైన్ తో నిర్మించి చారిత్రక శోభను తీసుకొచ్చారు.
ప్లాట్ ఫాం లపై ఎయిర్ పోర్ట్ తరహా వసతులు :
ప్లాట్ ఫాం లను పూర్తిగా ఆధునీకరించారు. యాంటీ స్కిడ్ టైల్స్, విశాలమైన షెల్టర్లు, హైమాస్ట్ లైట్లు, LED డిస్ ప్లే బోర్డులు, కోచ్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. నీలం-తెలుపు రూఫ్ తో ఈ వంతెన స్టేషన్ కే హైలైట్ గా నిలుస్తోంది.
కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు:
– ఎయిర్ కండిషన్ వెయిటింగ్ హాల్స్, కొత్త టికెట్ కౌంటర్లు
– దివ్యాంగుల కోసం ర్యాంప్, ప్రత్యేక మరుగుదొడ్లు
– ఉచిత వై-ఫై, సీసీటీవీ నిఘా
– పురుషులు, మహిళలకు ఆధునిక టాయిలెట్లు, తాగునీటి వసతి
– విశాలమైన పార్కింగ్, గార్డెన్, అప్రోచ్ రోడ్డు విస్తరణ
మొత్తంగా ఒకప్పుడు సాధారణ స్టేషన్ గా ఉన్న జహీరాబాద్, ఇప్పుడు అమృత్ భారత్ తో ఈ ప్రాంతంలోనే మోడల్ స్టేషన్ గా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది.

