సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 12 నుంచి 24వతేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. పీవీ విగ్రహం వైపు రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా మింట్‌కాంపౌండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్వైపు, రాజ్దూత్లేన్ మీదుగా బడా గణేశ్వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్మినార్వైపు, మింట్ కాంపౌండ్ మీదుగా ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డువైపు, మింట్‌కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్‌రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు, ఖైరతాబాద్ పోస్ట్ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు వెళ్లే వాహనాలను పోస్ట్‌ఆఫీసు వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్వైపు మళ్లిస్తామని తెలిపారు.
నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్సు రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలం, ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీజాగలో నెక్లెస్‌రోటరీ , ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలను, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ చేయాలని ఆయన కోరారు.