హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ నిర్వహణకు భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. రాష్ట్రంలో ‘సర్’ నిర్వహణకు సుమారు రూ. 220 కోట్ల వరకు వ్యయం అవుతున్నట్టు ఎన్నికలవర్గాలు వెల్లడించాయి. ఇందులో ఒక సిబ్బంది వేతనాలకే దాదాపు రూ.83 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వినియోగం, పర్యవేక్షణ, శిక్షణ, రవాణా, ఇతర పరిపాలనా ఏర్పాట్లకు కూడా గణనీయమైన మొత్తాన్ని వెచ్చిస్తున్నట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ‘సర్’ నిర్వహణ వ్యయంలో సగం మొత్తాన్ని కేంద్రం, మరో సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
భారీస్థాయిలో సిబ్బందిని రంగంలోకి దింపడంతోపాటు ఓటర్ల వివరాల పరిశీలన, ధ్రువీకరణ, డూప్లికేట్ నమోదుల గుర్తింపు తదితర ప్రక్రియలకు అదనపు వనరులు అవసరమవుతున్నాయి. ప్రక్రియ పూర్తయిన అనంతరం సుమారు మూడు నెలలకు కొత్త ఎపిక్ కార్డుల జారీకి అవకాశం ఉన్నది. ‘సర్’లో భాగంగా అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించినవారి విషయంలో మరింత కఠినమైన పరిశీలన చేపట్టనున్నారు. ఆయా ఓటర్లు తమ వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈసీఐ నిర్దేశించిన పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపించడం ద్వారా తమ గుర్తింపు, ఇతర వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ఓటరు జాబితాలో అనుమానాస్పదంగా ఉన్న నమోదులు, సరైన ఆధారాలు లేని వివరాలు, ఒకే వ్యక్తికి సంబంధించిన బహుళ నమోదులపై మరింత లోతైన పరిశీలన జరిగే అవకాశం ఉన్నది. ‘సర్’ ప్రక్రియ పూర్తయినంత మాత్రాన ఓటరు జాబితాల ప్రక్షాళన ముగిసినట్టు కాదని ఎన్నికలవర్గాలు స్పష్టంచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ప్రక్రియ పూర్తయిన అనంతరం ఓటరు జాబితాలను మరోసారి సమీక్షించే అవకాశం ఉన్నది. ఈ సమీక్షలో కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించాల్సిన పేర్లు, డూప్లికేట్ నమోదులు, తాజా మార్పులు, చిరునామా మార్పులు తదితర అంశాలను మరోసారి పరిశీలించే అవకాశం ఉన్నది. ఒకే వ్యక్తి, ఒకే దేశం, ఒకే ఓటు అనే నినాదం మేరకు మరోసారి సాంకేతికతతో ఫిల్టర్ చేస్తామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు.