మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్, అసోంలో గెలుపుతో మిడిసిపడిన కేంద్రంలోని బీజేపీ ముకుతాడి పడింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నవతరం ఆందోళన విజయవంతంగా ముగిసినప్పటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ సహా కమలం పార్టీ అగ్రనేతలు ‘జెన్ జీ’పై దృష్టి పెట్టాలని మంత్రులు, శ్రేణులను ఆదేశిస్తున్నారు. 12 ఏండ్లుగా గుర్తుకురాని విద్యావంతులు, యువతను ఆకట్టుకోవడానికి బీజేపీ నేతలు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు వెళ్లి ప్రసంగిస్తున్నారు. ప్రధాని ముందుండి మరీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
బీజేపీ కేంద్ర సర్కార్, ఆ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, మేధావులను ఎగతాళి చేస్తూ వారికి కొత్త పేర్లు తగిలించి వ్యంగ్యాస్ర్తాలతో భయపట్టే ప్రయత్నాలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు. దేశంలో పాలకపక్షానికి ఎదురుగాలి మొదలైందని, అది బలపడే దిశగా కదులుతున్నదనే సూచనలను వారు గమనించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని సహా ఆ పార్టీ పెద్ద నేతలు వాడే మాట లు కాస్త మెత్తగా కనిపిస్తున్నాయి. పూర్వపు ‘సమరశీల’ దూషణ శైలికి వారు తాత్కాలికంగా వీడ్కోలు పలికినట్టు కనిపిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని వాడిన ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త తిట్టు పాత ‘అర్బన్ నక్సల్’కు కొనసాగింపుగా భావించవచ్చు.
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నాటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాక మోదీ పైకి కనిపించేంతగా కుంగిపోయారు. ఆయన ప్రసంగాల్లో పస లేకుండా పోయింది. పైకి వ్యంగ్యంతో ముసుగేసినా ఆయన చిరునవ్వు వెనుక బీజేపీ దౌర్బల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కిందటి శనివారం ఆయన ఢిల్లీలోని ప్రఖ్యాత శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ శతవార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఇటీవల ఎర్రకోట బురుజుల మీద నుంచి చేసిన ప్రసంగంలో వాడిన ‘దిమాగీ నక్సల్’ అనే మాటలకు ఈ కార్యక్రమంలో చేసిన ఉపన్యాసంలో మోదీ వివరణ ఇచ్చారు. తాను ఈ మాటలను రోగులకు హోమియో గోళీలు ఇచ్చినట్టు వదిలానని, ఈ వైద్య చికిత్సకు అనుగుణంగా రోగ లక్షణాలు మరింత బయటపడ్డాయని, ‘దిమాగీ నక్సల్స్’ ఒకరి తర్వాత ఒకరు బయటికొచ్చారని ప్రధాని చమత్కరించడం వింతగా ఉన్నది.
మరో ఆసక్తికర అంశం ఏందంటే..జెన్‌జీ వాడే ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) వంటి మాటలు కూడా మోదీ కార్యక్రమాల్లో వినిపించడం. కాంగ్రెస్ నాయకత్వంలో దేశంలో కొన్నేండ్ల క్రితం కేంద్రంలో సాగిన యూపీఏ పాలనలో ఏ పనీ సకాలంలో సజావుగా సాగలేదని చెప్తూ, 2013లో కేదార్నాథ్ జలప్రళయం సమయంలో ప్రజలను నాటి సర్కార్ కాపాడలేకపోయిందని గుర్తు చేయడం ఆయన ధోరణిలో వచ్చిన మార్పు.
140 కోట్లకు పైగా ప్రజలున్న మనదేశంలో తమ సర్కార్ 2014 నుంచీ సమర్థంగా నడుపుతున్నదని చెప్పడానికి ప్రధాని అనేక ఉదాహరణలు ఇస్తున్నారు. మొత్తమ్మీద దేశంలో తన మూడో పదవీ కాలం రెండో సగంలో కనిపిస్తున్న ప్రజా వ్యతిరేకతకు ఇలా ప్రసంగాలతో మోదీ స్పందించడం, పలుకుల్లో పదును కోల్పోవడం ఇటీవలి నూతన పరిణామాలు. మోదీ ప్రధాని కావడానికి దారితీసిన 2014 లోక్‌సభ ఎన్నికల ముందు 2013లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఇదే శ్రీరాం కాలేజీలో చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ మాట్లాడిన తీరు కేంద్ర సర్కార్ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా కోల్పోతున్నదనే వాస్తవానికి అద్దంపడుతున్నది.
తన స్వరాష్ట్రం గుజరాత్‌లోని వడోదరాలో ప్రసిద్ధ మహారాజా సాయోజీరావు యూనిర్సిటీ ఆఫ్ బరోడాలో మోదీ మంగళవారం మాట్లాడారు. ‘వికసిత్ భారత్ కోసం నమో’ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణాది సూపర్ హీరోల శైలిలో ర్యాంప్ వాక్ చేసిన ప్రధాని తనను విమర్శించే వారిపై కొత్త తరహాలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్‌గాంధీ పేరెత్తకుండా మోదీ ఆయనను ఎగతాళి చేశారు.
నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ) రేవు నుంచి నోయిడా సమీపంలోని దాద్రీ వరకు ప్రత్యేక రవాణా కారిడార్‌కు సాగే మార్గంలో వేగంగా సాగే సరుకు రవాణా గురించి వివరిస్తూ, ‘ఇటీవల జేఎన్పీటీ నుంచి వడోదరా వరకూ ఒక సింగిల్ డబుల్ స్టాక్ కంటెయినర్ రైలు 250కి పైగా లారీలు మోసుకెళ్లే సరుకులను తీసుకెళ్లింది. ఇది నచ్చని నారాజ్ ఫూఫాలు (అలిగిన మామయ్యలు పరోక్షంగా రాహుల్‌గాంధీ)‘ ఇలా రైల్లో రవాణా భారీగా సాగితే ట్రక్ డ్రైవర్లు ఏమైపోవాలి?’ అని ప్రశ్నించే అవకాశం ఉన్నది’ అని మోదీ చమత్కరించారు. ఇంటి అల్లుళ్లకు ప్రత్యేక హక్కులు ఉంటాయనే భ్రమతో ఈ నారాజ్ ఫూఫాలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారనే తీరులో మోదీ ప్రతిపక్షాల నాయకులను దుయ్యబట్టారు. విపక్షాల నేతలను, తన సర్కార్ తీరును ఎండగట్టే మేధావులను దేశద్రోహులని పూర్వంలా ఆరోపించకుండా ఇప్పుడు దిమాగీ నక్సల్, నారాజ్ ఫూఫాలు అని ప్రధాని మాట్లాడడం బీజేపీ అగ్రనేతల్లో వచ్చిన కుంగుబాటుకు నిదర్శనం.
గతంలో మనదేశంలో, ఇతర దేశాల్లో మోదీ సర్కార్ విధానాలను, మతతత్వ పోకడలను, ఛాందస భావజాలాన్ని ప్రతిపక్ష నేతలు, మేధావులు తప్పుపట్టినప్పుడు వారిని పాకిస్థాన్ వంటి శత్రుదేశంతో కుమ్మక్కయిన శక్తులుగా మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ నేతలు అభివర్ణించేవారు. మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ధోరణికి బీజేపీ స్వస్తిపలికినట్టు కనిపిస్తున్నది. మరోపక్క కేంద్ర సర్కార్‌పై పోరాటాన్ని నవతరం మాదిరిగా నేరుగా చేయడంలో కాంగ్రెస్ నేత రాహుల్ విఫలమౌతున్నారు. అయితే, మోదీకి తగలని మాటల తూటాలను మాత్రం ఆయన బాగా పేలుస్తున్నారు. అందుకే బీజేపీ వ్యూహాత్మక మార్పును తన చేతల్లో, మాటల్లో అమలు చేస్తున్నది. మరోపక్క బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రజలను హిందువులు, ముస్లింలు అని విడదీసి మాట్లాడే పద్ధతికి తాత్కాలికంగా స్వస్తిపలికారు. ఈ మార్పు ఆయన విదేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి పాశ్చాత్య క్రైస్తవ దేశాల్లో పర్యటిస్తూ చేస్తున్న ప్రసంగాల్లో కనిపించింది.
బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశానికి దారితీసిన 20132014 ఆరంభం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని కాషాయ శిబిరం నేతలు గ్రహిస్తున్నారు. గడిచిన పన్నెండేండ్ల పాలనలో ప్రజల్లో నాటిన భయాలు ఇప్పుడు అంతగా లేవని కూడా వారు తెలుసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యతోపాటు ఆర్థిక సంక్షోభం ముసురుకుంటున్న తరుణంలో తమ వ్యూహం మార్చితే తప్ప మిగిలిన పాలన ప్రశాంతంగా సాగదనే అంచనా మోదీషా ద్వయంతోపాటు మోహన్ భగవత్‌ను కూడా ఇప్పుడు నడిపిస్తున్నదని అర్థమవుతున్నది.
-నాంచారయ్య మెరుగుమాల