మంచిర్యాల, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలు అమలు చేస్తున్న తీరుపై జనాగ్రహం వ్యక్తం అవుతున్నది. ఈనెల 26వ తేదీ నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్పిన సర్కారు.. మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలోనే ఇస్తామంటూ మెలిక పెట్టింది. గణతంత్ర దినోత్సవాన అర్ధరాత్రి 12 గంటలకే రైతులకు రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. టింగ్.. టింగ్.. అని మీ ఫోన్లకు మెస్సేజీలు వస్తాయన్నారు. కానీ.. అవి మండలంలోని ఒక గ్రామానికే ఇస్తుండడంపై మిగిలిన గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
ఆ ఒక్క గ్రామంలోని వారికే ఇచ్చి మిగిలిన వారికి ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ ఒక్క ఊరిలో ఉన్న వారే రైతులా? మిగిలిన గ్రామాల వారు కాదా? అంటూ మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం రైతుబంధు వచ్చేదని, అందరికీ ఒకేసారి టింగ్.. టింగ్ మంటూ రైతుబంధు మెస్సేజ్‌లు వచ్చేవని చెప్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు పడుతుందా? అని ఎదు రు చూడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. రైతు భరోసా ఇకనైనా రైతులందరికీ ఒకేసారి ఇవ్వాల్సిందంటున్నారు. సాగు పంట లు ఎన్ని ఎకరాలు, సాగులో లేని పంటలు ఎన్ని ఎకరాలో తేలకముందే ఆ గ్రామాల్లోని రైతులకు ఎలా వేశారో చెప్పాలంటున్నారు. గత ప్రభుత్వం తొలి రోజులు ఎకరం లోపు, రెండో రోజు రెండు ఎకరాల్లోపు అంటూ విడుతలవారీగా రైతులందరికీ రైతుబంధు వేసేదని, కాంగ్రెస్ సర్కారు కూడా అదే తరహాలో అందరికీ ఒకేసారి వేస్తే బాగుండేది అంటున్నారు.
నా పేరు పున్నం పోశం. మాది భీమారం మండ లం ఖాజీపల్లి గ్రామం. రెడ్డిపల్లి శివారు ప్రాంతంలో ఎకరంన్నర పొలం ఉంది. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతు న్నా రైతు భరోసా రాలే. ఇంకెప్పుడిస్తారో అర్థమైతలే దు. ఒక్క దాంపూర్ గ్రామానికే పథకాలిస్తే మేమెట్లా. మేము ఓట్లు వేయలేదా. ఇట్లా కాంగ్రెసోళ్లు ఎన్నిసార్లు మోసం చేస్తరు. వానకాలం, యాసంగి సీజన్లో రైతు భరోసా కింద ఎకరాకు రూ. 7500 ఇస్తమని కాంగ్రెస్ చెప్పి మోసం చేసింది. దాంపూర్లోనే మస్తు మంది రైతులకు రైతు భరోసా రాలే.. ఇగ మాకెప్పుడిస్తరు. గీ కాంగ్రెసోళ్లకు పాలన చేసుడు వస్తలేదు. తెలిసీ తెలియని పనులు చేస్తున్నరు.
మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి పథకాలు అందజేస్తామని చెప్పినప్పటికీ ఆ గ్రామాల్లోనూ పథకాల అమలు లోప భూయిష్టంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. సర్కారు నిర్వహించిన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారం గానే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ఆరు గ్యారెంటీల కోసం అమలు చేసుకున్న సమయంలో, మీ సేవల్లో చేసిన దర ఖాస్తులేవీ పరిగణలోకి తీసుకోలేదని గ్రామ పంచాయతీ అధికారులు చెప్తున్నారు. దీంతో ఇల్లు లేని చాలా మందికి ఇంది రమ్మ ఇండ్లు కూడా రాకుండా పోయాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇంకా న్యాయం జరగలేదని తెలుస్తున్నది. రేషన్ కార్డుల విషయంలోనూ ఇదే జరిగిందని అధికారులు అంటున్నారు.
మొన్న గ్రామసభల్లో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలినకు ఇంకా సమయం పడుతుందని, వారికి వస్తాయో? రావో? అన్న దానిపై తమకే స్పష్టత లేదని చెప్తున్నారు. ఆత్మీయ భరోసా విషయంలో పట్టణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు సర్కారు మొండిచేయి చూపించి నట్లు తెలుస్తున్నది. గ్రామంలో ఉపాధి కూలీలు చాలా మంది ఉంటే ఏడాదికి 20 రోజుల పని దినాలు ఉన్న వారికే ఇస్తు న్నారనే ప్రచారం జరుగుతుంది. పథకాలు ఇచ్చిన సర్కారు మండలానికి ఒక్క గ్రామానికే కాకుండా, అర్హులందరికీ ఒకే సారి ఇవ్వాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుభరోసా విషయంలో రైతులందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), జనవరి 28 : నా పేరు శ్యాంరావు. నాది బెజ్జూర్ మండలం కుశ్నపల్లి గ్రామం. మా ఊరి శివారులో 6 ఎకరాలు ఉంది. యాసంగి సాగు కోసం దున్నిపిస్తే రూ. 22 వేల దాకా ఖర్చయినయి. ఇగ వరి నాట్ల కోసం మరో రూ. 25 వేల దాకా అయితయి. కాంగ్రెసోళ్లు రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఓ సావుకారి వద్ద అప్పు తెచ్చుకున్న. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బుల పడుతయని చెప్పిన్రు. కానీ రెండు రోజుల నుంచి పైసా పడలేదు. గీ కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి రైతులను అరిగోస పెడుతున్నది. గిప్పటి దాకా నయా పైసా పెట్టుబడి సాయమందించింది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. రైతుబంధు సాయం ఎప్పటికప్పుడు వేస్తుండే. ఎదురు చూసే పని లేకుండే. ఇప్పుడు రైతుబంధు రావాల్నేంటే దరఖాస్తు చేసుకోవాలి. గ్రామ సభల పొంటి తిరుగాలి. కాంగ్రెసోళ్లు రైతులకు పెద్ద తలకాయ నొప్పి పెట్టిన్రు. పొలం పనులు బంద్ చేసి ఆఫీసులు, బ్యాంకుల సుట్టూ తిరుగుడుకే సరిపోతంది. ఇక ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదేళ్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్నరు. అది కూడా దిక్కులేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), జనవరి 28 : నాకు సెంటు భూమి లేదు. కూలీ పనులు చేసుకుంటున్న. ఆ పని కూడా రోజూ దొరకదు. ఉన్ననాడు చేస్కునుడు.. లేని నాడు ఇంట్లనే ఉండుడు. కుటుంబాన్ని సాకడం మస్తు తిప్పలైతంది. భూమి లేకపోవడం వల్ల రైతుభరోసా ఎలాగూ రాదు. కనీసం ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు అయినా ఇవ్వాలి. మండలానికి ఒక్క గ్రామంలోనే పథకాలను అమలు చేస్తే.. మరి మిగతా గ్రామాలన్నీ ఏమైపోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మా గ్రామంలో కూడా అమలు చేయాలి. ఏం పథకాలో ఏమో.. గిసొంటి సర్కారును ఇప్పటి దాకా సూడలే..
– పెద్దల సతీశ్, వ్యవసాయ కూలీ, కుశ్నెపల్లి
నాకు భర్త లేడు. పిల్లలు లేరు. ఒంటరి మహిళను. నాకు కొత్త రేషన్‌కార్డు కావాలని సార్లకు మొరపెట్టుకున్న. మొన్న దాంపూర్‌కు వచ్చి పేర్లు సదివిండ్రు. గా లిస్టులో నా పేరు రాలే. నాకు కనీసం రేషన్ కార్డు కూడా ఇయ్యరా. అట్లనే ఇందిరమ్మ ఇంటి పథకం లిస్టులో కూడా నా పేరు రాలే. నాకెందుకు ఇల్లు ఇస్తలేరు. నేనేం పాపం చేసిన. గీ కాంగ్రెస్ సర్కారు మాలాంటి పేదోళ్లను గోస పెట్టుకుంటుంది. ఏం లేని దాన్ని.. ఇగ నాలాంటోళ్లకు సాయం చేయకుంటే గీ సర్కారు ఎందుకు.
– బాసాని లింగమ్మ, దాంపూర్