మంచిర్యాల : రాష్ట్ర ప్రభుత్వం బీసీల ( BC ) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డుల ( Placards ) తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ ఫెడరేషన్లకు పాలకమండళ్లను ఏర్పాటుచేసి నిధులు విడుదల చేయాలని, నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయాలని, ఎంబీసీ మంత్రిత్వ శాఖను, సంచారక కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని కోరారు. కొత్తగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు ఒక్కొక్క కార్పొరేషన్‌కు రెండు వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీల డిమాండ్లపై చర్చ పెట్టి ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జలు వెంకటయ్య, శాఖపూరి భీమ్సేన్, ధర్మాజీ మల్లేష్, ఆరేందుల రాజేశం, కీర్తి బిక్షపతి, అంకం సతీష్, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, కొట్టి నటేశ్వర్, రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు.