తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన మోదీ మాటలపై యావత్ తెలంగాణ లోకం మండిపడింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవారం అడుగడుగునా ఆందోళనలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాలు, శవయాత్రలు, నల్లజెండాలతో నిరసనలు, భారీ బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరాగా.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాషాయ పార్టీ కపట నాటకంపై కదం తొక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యరూపం అన్ని ప్రాంతాల్లో అవిష్కృత మైంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనాలతో అట్టుడుకగా.. మోదీ డౌన్ డౌన్.. బీజేపీ హటావో.. దేశ్ బచావో.. అంటూ నినాదాలు చేశారు. దేశానికే ఐకాన్‌గా మారిన తెలంగాణపై మరోమారు అక్కసు వెళ్లగక్కితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల జిల్లా కేంద్రంలో విప్ సుమన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని నిరసన తెలిపారు. – ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాజ్యసభ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు. రాస్తారోకోలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ, మోదీ దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించి కూడళ్ల వద్ద దహనం చేశారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మాత్యులు ఇంద్రకరణ్‌రెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, శివాజీ చౌక్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల పట్టణంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముథోల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న, తాంసి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, రెబ్బెన మండలంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు విషయంలో అవమానకరంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ చరిత్రను తెలుసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో 66 సంవత్సరాలుగా చర్చ జరిగిందని 1956 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతూ ఉద్యమాలు కొనసాగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించాలని వందలాది మంది బలిదానాలు చేసుకున్నారని, ప్రత్యేక రాష్ట్రం విషయంలో దేశంలోని 35 పైగా వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అవాకులు, చెవాకులు మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమాలు, ప్రజల ఆంకాక్షలను ప్రధానికి తెలియజేయాలని సూచించారు. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
– మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి