ఇంద్రవెల్లి, జనవరి 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి(బీ), కేస్లాపూర్, మెండపల్లి, ముత్నూర్, గౌరపూర్, వాల్గోండా గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. సంక్షేమ పథకాల గురించి ఇంద్రవెల్లి గ్రామసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే అందుబాటులో ఉన్న ఎస్ఐ సునీల్, అధికారులు కలిపించుకొని వాగ్వాదానికి దిగిన నాయకులను సముదాయించారు. భీంనగర్‌కు చెందిన చాటే ఉజ్వల తనకు నాలుగింటిలో ఏ పథకం మంజూరు జాబితాలో తమ పేరు రాలేదని గ్రామసభలో అధికారులకు వివరించింది. దీంతో స్పందించిన డీఆర్డీవో రాథోడ్ రవీందర్ ఆ మహిళ సమస్యలు విని తన డైరీలో నమోదు చేసుకున్నారు. జాబితాలో పేర్లు లేని ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జాబితాలో పేర్లు రాని ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఏవో గణేశ్, ఏపీవో శ్రీనివాస్, ఈవో సంజీవరావ్, టీఏ మహేందర్, ఏఈవో వీర, నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 22 : భీంపూర్ మండలం గోముత్రి గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సర్కారు సూచించిన నాలుగు పథకాలు అమలులో ఉంచితే రుణమాఫీ గురించి రైతులు అసహనం వ్యక్తంజేశారు. తమకు ఇంకా రుణమాఫీ కాలేదని 55 మంది రైతులు సభలో వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారులకు విన్నవిస్తామని ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఏఈవో వికాల్ అన్నారు. సభ ఏదైనా సరే రుణమాఫీ గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని , సర్కారును నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, రైతులు చెప్పారు. గ్రామసభలో ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఫొటో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఆర్ఐ రాందాస్, పంచాయతీ కార్యదర్శులు లోకేశ్, వినోద్, నర్సయ్య, రైతు నాయకులు నిమ్మ వేణు, బండి మల్లేశ్, గజానన్, గౌడి నారాయణ, రాకేశ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 22 : ఆదిలాబాద్‌లోని వార్డు నంబర్ 10 రాంనగర్లో వార్డు సభ నిర్వహించారు. కాలనీ వాసుల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కౌన్సిలర్ తుర్పటి సుజాత భూమన్న, వార్డు ప్రత్యేకాధికారి సువర్ణ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సుమలత, ఆర్పీలు లక్ష్మి, వందన, మైనార్టీ నాయకుడు భూమన్న, సతీశ్‌యాదవ్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇచ్చోడ, జనవరి 22: జాబితాలో పేర్లు రాని లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జడ్పీసీఈవో జితేందర్ అన్నారు. ఇచ్చోడ, కామగిరి, నర్సాపూర్, గుండాల, మాదపూర్, సాత్ నంబర్, జామిడి, ముక్రా(బీ) గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. మండల కేంద్రంలో జాబితాలో పేర్లు రాని లబ్ధిదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారి దరఖాస్తు కోసం ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణ్, ఏఈవో కైలాస్, ఎంఈవో బిక్కు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 22 : భీంపూర్ మండలం బేల్సరిరాంపూర్, అర్లి(టీ), గోనా, గుబిడిపల్లి, కామట్‌వాడ, గోముత్రి, తాంసి(కే)లో నిర్వహించిన గ్రామసభల్లో కొన్ని చోట్ల జనం అంతగా కనిపించలేదు . అర్లి(టీ)లో భూమి లేని పేదలకు జాబ్‌కార్డు లేని కారణంగా రూ.12 వేలు లబ్ధి చేకూరే అవకాశం లేకుండా పోతున్నదని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు బొంత నితిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు విన్నవిస్తామని ప్రత్యేకాధికారి అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కిషన్, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో ఓపాల కృష్ణారెడ్డి, డీటీ హరిదాస్, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, రాజలింగు, సుమీర్ అహ్మద్, సునీత, తిరుపతి, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బోథ్, జనవరి 22: బోథ్‌లో నిర్వహించిన గ్రామ సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వాటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు, అర్హుల జాబితాను ఎంపీడీవో రమేశ్ చదివి వినిపించారు. అనంతరం పదేళ్ల పాలనను బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టివ్వలేదని కాంగ్రెస్ నాయకులు అనడంతో ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. తమ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రస్తుతం పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. సీఐ వెంకటేశ్వర్రావ్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ ఇరువర్గాలను సముదాయించారు. సమావేశంలో ఏడీఏ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ సుభాష్‌చంద్ర, ఎంపీడీవో రమేశ్, ప్రత్యేకాధికారి వాజిద్ అలీ, ఏపీవో జగ్దేరావ్, వ్యవసాయ అధికారులు, ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జనవరి 22 : ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్, హస్నాపూర్, పులిమడుగు, కుమ్మరితండా, తాండ్ర, బాబాపూర్, కామయిపేట్, శ్యాంనాయక్తండా, బిర్సాయిపేట్, దంతన్‌పల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. శ్యాంపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో గుడిసెలు, పెంకుటిల్లు, రేకుల ఇండ్లు గల వారి పేర్లు రాలేదని నాయకులు, గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీవో సురేందర్ రెడ్డి రానివారు దరఖాస్తు చేసుకోవాలని వారికి కూడ మంజూరు అవుతాయని పలు మార్లు నచ్చజెప్పిన వినలేదు. ఇందిరమ్మ కమిటీలు, అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే చేసిన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అనంతరం సీఐ మొగిలి నచ్చజెప్పడంతో శాంతించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దావులే బాలాజీ, మాజీ సర్పంచ్‌లు మల్లిక, జాదవ్ జగదీశ్, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 22 : నేరడిగొండ మండలంలోని రాజురా, బోరిగాం, కుంటాల(కే), తర్నం(కే), బుద్దికొండ, లఖంపూర్, ఇస్పూర్ గ్రామాల్లో గ్రామసభలు పోలీసు పహారలో కొనసాగాయి. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు చేయకపోవడంతో ప్రజలు ఎక్కడ ఆందోళన చేస్తారని ముందుగానే ప్రతి గ్రామసభ వద్ద పోలీసు అధికారులను నియమించారు.
తాంసి, జనవరి 22: తాంసి మండలంలోని గోటూరి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒకరిని మాత్రమే ఎంపిక చేశారని అర్హులను గుర్తించలేదని గ్రామస్తులు అధికారులతో వాపోయారు. అదేవిధంగా జామిడి గ్రామంలో దాదాపు 30 నుంచి 40 మంది అర్హులున్నప్పటికీ అనర్హులుగా గుర్తించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల కిందట ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణంపై అధికారులను ప్రశ్నించగా పట్టించుకోలేదు.
జైనథ్, జనవరి 22 : జైనథ్ మండలంలోని ఆనంద్‌పూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ కమిటీని గ్రామస్తులు, నాయకులు, రైతులు మహిళలు ఈజీఎస్ కూలీలు బహిషరించారు. రైతు భరోసా, ఎన్ఆర్ ఈజీఎస్ కూలీలకు 300 మంది ఉండగా 13 మందికి అవి భూములు ఉన్న వారికి రూ.12 వేలు చెల్లించడం తగదని గ్రామస్తులు మహాజాన్, సీహెచ్ సుభాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాధాసాయినాథ్ వ్యతిరేకించారు. గ్రామ ప్రత్యేకాధికారి వినోద్ దేశ్‌పాండేతో ఎస్ఐ వీ పురుషోత్తం ముందు గ్రామస్తులు, రైతు కూలీలు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లేశ్, టీఏ రాకేశ్, నాయకులు పరమేశ్వర్, గంభీర్, మాసం నర్సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఖానాపూర్, జనవరి 22: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని 5, 6, 7, 8 వార్డుల్లో జరిగిన వార్డు సభలో అధికారులు అర్హుల జాబితా చదివి వినిపించగా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికి పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తూ చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ఇప్పటికైన పథకాలు వస్తాయా అంటూ ప్రజలు అధికారుల వద్ద దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
కడెం, జనవరి 22: కడెం మండలంలోని అల్లంపల్లి, బాబానాయక్‌తండా, ధర్మాజిపేట, కన్నాపూర్, మైసంపేట, నవాబుపేట, పెద్దబెల్లాల్, సారంగాపూర్, ఉడుంపూర్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు డీఆర్డీవో విజయలక్ష్మి హాజరయ్యారు. పెద్దబెల్లాల్లో ప్రజలు అధికారులతో గతంలో తీసుకున్న దరఖాస్తుల విషయమై అడగగా వాగ్వాదానికి దారి తీసింది. అలాగే కన్నాపూర్‌లో గతంలో తమకు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇప్పటికి ఇళ్లు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు ఇలా దరఖాస్తులు తీసుకుంటారని అధికారులపై మండిపడ్డారు. కార్యక్రమాల్లో మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
కుభీర్, జనవరి 22: కుభీర్ మండలంలోని పార్డి(బీ) గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్ ఆదేశంతో పంచాయతీ కార్యదర్శి భూమేశ్ లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. 460కి మించి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటే 50 మందికి మాత్రమే కావడంపై ఎందుకీ ప్రయోజనం లేని గ్రామసభలు.. ఎవరిని ఉద్దరించేందుకు అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుభీర్ ఎస్ఐ రవీందర్ అక్కడికి చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. మండల ప్రత్యేకాధికారి శంకర్, తహసీల్దార్ అశోక కుమార్, ఎంపీడీవో నవనీత్ కుమార్, ఎంపీవో మోహన్‌సింగ్ పాల్గొన్నారు.
ముథోల్, జనవరి 22 : ముథోల్ మండలంలోని గన్నోరా, కారేగాం, తరోడా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తరోడా గ్రామంలో అర్హులకు రేషన్ కార్డు జాబితాలో పేర్లు రాలేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. వెంబడే తహసీల్దార్ శ్రీకాంత్ గ్రామసభకు చేరుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. మళ్లీ యథావిధంగా గ్రామసభ కొనసాగింది.
దిలావర్పూర్ జనవరి 22: దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి, సాంగ్వి, కంజర్ గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. బన్సపల్లిలో యువకులు, గ్రామస్తులు, మహిళలు అధికారులను నిలదీశారు. గ్రామసభ గందర గోళంగా మారడంతో దిలావర్పూర్ ఎస్ఐ సందీప్ అక్కడి చేరుకున్నారు. రేషన్‌కార్డుల జాబితాను చదివి వినిపిస్తుండగా సంబంధిత శాఖ అధికారి గ్రామస్తులు అర్హులకు కార్డులు రాలేదని నిలదీశారు. అదే విధంగా భూమిలేని పేదలకు ఆత్మీయ భరోసా గురించి కూలీలు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ ్లజాబితా గురించి చదువుతుండగా మీరు ఎంతమందికి ఇండ్లు ఇస్తారో ముందు చెప్పాలని మహిళలు అధికారులను చుట్టముట్టారు. సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేనివారు, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అరుణరాణి కోరడంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సారంగాపూర్, జనవరి 22: సారంగాపూర్ మండలంలోని కుప్టి, అడెల్లి, చించోలి(బీ), ప్యారమూర్, పొన్కూర్, పొట్యా, రాంసింగ్‌తండా, రవీంద్రనగర్, యాకర్‌పల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో రేషన్‌కార్డుల లబ్ధిదారులకు పూర్తిగా కార్డులు రాకపోవడంతో ప్రజలు అధికారులను నిలదీశారు.
సోన్, జనవరి 22: నిర్మల్ మండలంలోని అక్కాపూర్‌లో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి ఆర్డీవో రత్నకల్యాణి, ఎంపీడీవో గజానంద్రావు హాజరయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూములు లేని అర్హులైన వారి పేర్లు లేవని అధికారులను నిలదీశారు. వచ్చిన జాబితా కాకుండా గ్రామసభలో ఎంపిక చేసిన పేర్లను చేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆర్డీవో రత్నకల్యాణి మాట్లాడుతూ ఇది నిరంతర ప్రక్రియని పేర్లు లేనివారు ఇక్కడ ఉన్న కౌంటర్లో దరఖాస్తులను అందించాలని కోరారు. అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఏపీఓ తుల రామకృష్ణ, ఏఈఓలు, గ్రామ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.