మంచిర్యాల, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలకు ఊరు నుంచి హాస్పిటల్కు వెళ్లే మార్గంలోని వాగు రాత్రికి రాత్రే ఉప్పొంగితే.. రేపో.. మాపో.. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణీ మోకాళ్ల లోతు నీటిలో నుంచి వాగులు, వంకలు దాటాల్సిందే. మారుమూల పల్లెలు, గూడేల్లోని పిల్లలు చదువుకోసమని మండల కేంద్రంలోని బడికి వెళ్లి తిరిగి వచ్చేప్పుడు ఏ గతుకుల రోడ్డులోనో.. మట్టి రోడ్డులో ఆటో దిగబడితే తోయాల్సిందే. వాగులు ఉప్పొంగి రోడ్లు కొట్టుకుపోయినా, వంతెనలు ముగినిపోయినా.. కొన్ని గ్రామాల ప్రజలు నేటికీ రోజుల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాల్సిందే. వర్షాకాలం వచ్చిదంటే చాలు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్కడ చూసిన కనిపించే దృశ్యాలు.. సరైన రోడ్లు లేక, వాగులు-వంకలపై వంతెనలు లేక మారుమూల గ్రామాలు, ఆదివాసీ పల్లెలు, తండాలు, గూడేల్లోని జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకటి, రెండు కాదు వందల సంఖ్యలో పల్లెల్లో ఇదే దుస్థితి. పదేళ్లకు ముందు ఇంతకంటే దారుణంగా ఉన్న పరిస్థితి కేసీఆర్ సర్కార్ పుణ్యమా అని బాగుపడింది. 60 శాతం నుంచి 70 శాతం వరకు మారూమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. వందకు పైగా వాగులు, వంకలపై కేసీఆర్ సర్కార్ వంతెనలు నిర్మించింది. రూ.కోట్లు వెచ్చింది రోడ్లు, అప్రోచ్ రోడ్డు వేసింది. ఇంకా పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ నుంచి నిధులు మంజూరు చేసింది. కొన్ని పనులు పురోగతి దశలో ఉండగా, మరికొన్ని టెండర్ల దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ పనులను పట్టించుకోలేదు. రీ టెండర్ పేరిట ఆపేసింది. పురోగతిలో ఉన్న పనులకు నిధులు ఆగిపోయాయి. అటవీ శాఖ అనుమతులు లేక మరికొన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సర్కారు నిర్లక్ష్యంతో సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు అరిగోస పడుతున్నారు. అందుకు అద్దం పట్టే ఘటనలు, ఫొటోలు, వివరాలు ఇలా.. వీటితోనైనా కాంగ్రెస్ సర్కారు స్పందించి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో గల ఎదుల్లబంధం గ్రామానికి వెళ్లే దారిలోని తుంతుంగ వాగు ప్రవాహం పెరిగి ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, శివరాంపల్లి, కొత్త సూపాక, వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2020 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తుంతుంగ వాగుపై రూ.8 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. పారుపల్లి నుంచి ఎదుల్లబంధం మధ్యలో రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఎదుల్లబంధం గ్రామం సమీపంలోని రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఉందని ఈ ప్రాంత నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదు. దీంతో రోడ్డు తెగిపోయి ఈ గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేక ప్రస్తుతానికి ఈ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో పారుపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మించలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే వివేక్ దృష్టిపెట్టి ఈ రోడ్డును పూర్తి చేయించాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు.
వేమనపల్లి మండల కేంద్రం నుంచి ఇటు బెల్లంపల్లి, అటు చెన్నూర్ నియోజకవర్గాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. వేమనపల్లి నుంచి కల్లెంపల్లి వరకు బీటీ రోడ్డు, వంతెనలు ఉన్నప్పటికీ దిగువనున్న ప్రాణహిత నదీ ఉప్పొంగి వరద ప్రవాహానికి సంపు టం, జాజులపేట, ముక్కిడిగూడం, కల్లెంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. 2018 లో నీల్వాయివాగుపై రూ.8 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం హై లెవెల్ వంతెన నిర్మించింది. ఇక్కడ అప్రోచ్ రోడ్డు కావాల్సి ఉంది. బుయ్యారం బీటీ రోడ్డుకు రూ.14 లక్షల నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించినా అటవీ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి. ప్రస్తుత వర్షాలకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు బురదమయంగా మారి జిల్లెడ, బు య్యారం, సూరారం, లక్ష్మీపూర్, చామనపల్లి, నాగారం గ్రామాల ప్రజ లు మండల కేంద్రానికి రావడానికే నానా అవస్థలు పడాల్సి వస్తున్నది.
కోటపల్లి మండలంలోని నక్కలపల్లి, బ్రాహ్మణపల్లి.. వేమనపల్లి మండలంలోని చామనపల్లి, బమ్మెన, బద్దంపల్లి గ్రామాల ప్రజలను లోతొర్రె కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేదారిలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కేసీఆర్ సర్కారు రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పనులు ఆగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులో నిర్మించిన లోలెవల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు కష్టంగా మారాయి.
కోటపల్లి మండలంలోని రాజారం గ్రామ పంచాయతీలో 1125 మంది జనాభా ఉండగా, 844 మంది ఓటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి రూ. 2.30 కోట్లు, పారుపల్లి నుండి కావరకొత్తపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.3.30 కోట్లు మంజూరు చేయగా.. అటవీ శాఖ అనుమతులు లేని కారణంగా పూర్తి కాలేదు. అటవీ అనుమతికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివేషంగా కృషి చేసినా అనుమతులు రాలేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ గ్రామానికి ఉన్న రెండు దారులలో ఒక దారి మూసుకుపోయింది. మరొక దారి బురదమయం కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని అనార్పల్లి వాగుపై వంతెన నిర్మాణం పిల్లర్లకే పరిమితం కావడంతో గోండుగూడ, అనంద్గూడ, బోరిలాల్గూడ, జన్కాపూర్, కరంజివాడ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లెలు, గూ డేలకు రవాణా సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడుములోతు నీళ్లలో వాగు దాటుతున్నారు. శుక్రవారం బెజ్జూర్ మండంలోని తాలయి గ్రామానికి చెందిన గర్భిణులు లంగారి లావణ్య, లంగారి మేఘనలకు 9 నెలలు నిండడంతో తలాయివాగుపై నాటు పడవలో బెజ్జూరు మండలం కేంద్రానికి తరలించారు. వాగుపై వంతెన లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అత్యవసర సమయాల్లో నాటు పడవల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.
మాది మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని జాజుల పేట. ఈనెలలో డెలివరీకి టైం ఇచ్చారు. భారీ వర్షాలకు ప్రాణహిత నదీ ఉప్పొంగి సంపుటం అట్టలొర్రె వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తూ మా ఊరుకు రాకపోకలు నిలిచాయి. ముందు జాగ్రత్తగా వైద్య సిబ్బంది చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. గత నెల 25వ తేదీన దవాఖానకు వచ్చేప్పుడే నీట మునిగిన అట్టలొర్రె వంతెనను మోకాళ్ల లోతు వరదలో పోలీసులు, వైద్యుల సహాయంతో ఇబ్బంది పడుతూ దాటిన. డెలివరీకి సమయం ఉంది. ఈ నాలుగు రోజులు అమ్మ- అత్తమ్మ దగ్గర ఉంటే బాగుంటుందనుకున్న. కానీ.. ఉన్నఫలంగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించడం బాధగా ఉంది. కాకపోతే వరద తీవ్రత ఇంకా పెరిగి మా ఊరిలో ఉన్నప్పుడే నొప్పులు వచ్చి ఉంటే నాతోపాటు నా బిడ్డను కూడా ఇబ్బంది పెట్టిన దాన్ని అవుత. గతంలో ఓ కాన్పులో ఆడబిడ్డ పుట్టి చనిపోయింది. అమ్మ, అత్తమ్మ దగ్గర లేకపోతిని అనే బాధ ఉన్నా.. అన్ని ఆలోచిస్తే హాస్పిటల్కు వచ్చే మంచి పని చేసిన అనిపిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు కాకుండా మా ఊరుకు హై లెవల్ వంతెన కడితే బాగుంటుంది.
నెన్నెల మండలంలో మారుమూల అటవీ గ్రామాలైన కోణంపేట, మన్నెగూడెం, దమ్మిరెడ్డిపేట, లంబడితండా, జంగాల్పేట గ్రామాలకు రోడ్డు సౌకర్యంలేక ప్రజ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబాడితండా ఎర్రవాగుపై వంతెన లేక చిన్నపాటి వర్షానికే ఉప్పొంగే వాగును దాటేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణీకులు గంటల తరడి వేచి చూడాల్సి వస్తోంది. ఏడాది కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండర్ పిలిచింది. కానీ.. ఎన్నికల తర్వాత దానిని రీ టెండర్ పేరిట నిలిపేశారు. ప్రస్తుతం లో కాజ్వే కల్వర్టుపై ఉన్న సిమెంట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. మన్నెగూడెం నుంచి కోణంపేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేసినా అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిచిపోయాయి. కోణంపేట నుంచి అటు కుశ్నపల్లికి వెళ్లేందుకు రూ.3.50 కోట్లతో మూడు వంతెనలు నిర్మించారు. కానీ వంతెనలకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు లేక కాలినడకన వెళ్లాల్సి వస్తున్నది.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండివంతెన నిర్మాణానికి రూ.5 కోట్లతో రీ-ఎస్టీమేట్ చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా పనులు ప్రారంభించ లేదు. దీంతో గుండి గ్రామంతోపాటు భీంపూర్, కన్నెరగాం, దుబ్బగూడా గ్రామాల ప్రజలు వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని మారుమూల మండలాలైన తిర్యాని, లింగాపూర్ మండలాల్లో పరిస్థితి దయనీయం. చింతలమానెపల్లి మండలంలోని బాబాసాగర్- నాయికపు గూడా, కేతిని-దిందా, రణవెల్లి- టేకం గూడా వాగులపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. బెజ్జూర్ మండలలోని తాలాయి, తిక్కల్లి, బీమారం వాగులపై, దహెగాం మండలంలోని మెర్లిగూడా, కొత్మీర్-దుబ్బగూడా వాగులపై, దహెగాం- కల్వాడ వాగుపై వంతెనలు లేకపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.