దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై మరోసారి విషంగక్కారు. 2014 ఎన్నికల సమయంలోనే.. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అక్కసు వెల్లగక్కిన ఆయన.. మళ్లీ పెద్దల సభ సాక్షిగా కుటిల బుద్ధిని బయటపెట్టారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే.. రాష్ట్ర విభజనను అడ్డుగా చూపించి తన మనసులోని విషాన్ని బయటికి చిమ్మారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలువడంతోపాటు ఏకంగా గుజరాత్ వంటి రాష్ర్టాలను తలదన్నే రీతిలో దూసుకెళ్తున్న తరుణంలో మోదీ విషం చిమ్మడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అరవై ఏళ్ల తమ కల నేరవేరిందని సంబుర పడుతూ.. అన్ని రంగాల్లో సగర్వంగా ముందుకు సాగుతున్న సమయంలో మోదీ వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. అంతేకాదు, ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉద్యమాలు, అమరవీరుల త్యాగాలను అవమానపరిచారని ఆగ్రహిస్తున్నారు.
– కరీంనగర్/ఆదిలాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర విభజన తదుపరి 2014లో జరిగిన జమిలి ఎన్నికల సమయంలో.. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మోదీ ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు వెల్లగక్కారు. రాష్ట్ర విభజన ద్వారా తల్లీబిడ్డను వేరు చేశారని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆనాడే తెలంగాణవాదులు భగ్గుమన్నారు. దీనిపై అనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణాల త్యాగాల ద్వారా తెలంగాణను తెచ్చుకున్నామని, అటువంటి రాష్ట్ర ఏర్పాటులో ఎవరు తల్లో, ఎవరు బిడ్డో చెప్పాలని, ఎవరు ఎవరిని చంపారో వివరించాలని సవాల్ విసిరారు. దీనిపై ఆనాడు బీజేపీ నాయకులెవరూ నోరు మెదపలేదు. సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో అప్పుడప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా దేశ ఉన్నత సభల్లోనే ప్రధాని మోదీ తన మనసులో నింపుకున్న విషాన్ని కక్కారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తద్వారానే రెండు రాష్ర్టాల్లో సమస్యలు నెలకొన్నాయని, ఆనాడు తలుపులు మూసి వేసి తెలంగాణ ఇచ్చారని, ఎలాంటి చర్చ లేకుండానే ఏపీని విభజించారని, కాంగ్రెస్ అహంకార అధికార కాంక్షకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సందర్భం లేకపోయినా.. కాంగ్రెస్‌ను ముందు పెట్టి తెలంగాణపై తన అక్కసు ప్రధాని కక్కారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ జెప్పన రాకపోవడానికి, మా బిడ్డలు సచ్చిపోవడానికి బీజేపోళ్లు, కాంగ్రెసోళ్లే కారణం. గతంలో దేశాన్ని ఏలిన కమలం పార్టోళ్లు మూడు రాష్ర్టాలు ఇచ్చినపుడు తెలంగాణ ఇచ్చుంటే 1,200 మంది విద్యార్థులు బలిదానం చేసుకునేటోళ్లు కాదు. వీరి సావులకు బీజేపోళ్లదే బాధ్యత. కాంగ్రెసోళ్లు గూడా తెలంగాణ ఇస్తమని జెప్పి ఇయ్యలే. రాష్ట్రం రాదేమోనని నా కొడుకు భూమారెడ్డి 2010లో ఆత్మహత్య జేసుకున్నడు. ఇగ, కేసీఆరే మా కుటుంబాలకు అండగా ఉన్నడు. పది లచ్చలిచ్చుండు. ఒకరికి నౌకరిచ్చిండు. మోదీ మాత్రం మొండిచేయి చూపిండు. గిప్పుడేమో తెలంగాణపై ఇట్టమచ్చినట్టు మాట్లాడుతున్నడు.
– ఏనుగు లింగమ్మ-నారాయణరెడ్డి, బోరిగామ, ఇచ్చోడ మండలం
బీజేపీ సర్కారు తెలంగాణపై కక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నది. ఇందులో భాగంగానే పార్లమెంట్ సాక్షిగా ప్రదాని మోదీ తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన 19 ప్రతిపాదనలు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. ఒక ప్రధాని హోదాలో విషం గక్కడం దురదృష్టకరం. – రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ
శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
తెలంగాణపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సార్లు ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తెలంగాణలోని వివిధ రంగాల నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. అయినా కేంద్రంపై ఆధారపడకుండా స్వశక్తితో రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు పెడుతున్నది. ఈ పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైల్వే రంగం నుంచి రక్షణ రంగానికి చెందిన భూముల బదాలయింపుల వరకు.. వ్యవసాయ రంగం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నిధుల కేటాయింపుల వరకు.. కేంద్రం నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నది. తెలంగాణలో మూడేళ్లలో ప్రపంచం అబ్బరపడేలా ప్రాజెక్టులు కడితే.. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదు. నవోదయ నుంచి ట్రిపుల్ఐటీ వంటి అనేక విద్యాసంస్థలను బీజేపీ పాలిత రాష్ర్టాలకు కేటాయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు. సింగరేణి లాంటి సంస్థలను ప్రవేటీకరణ చేసే కుట్రలకు తెరతీస్తున్నారు.
నాడు సమైక్య వాదుల సంకెళ్ల కింద నలిగిపోయిన తెలంగాణ, నేడు రాష్ట్రంగా అవతరించి స్వశక్తితో ముందుకుసాగుతున్నది. తెలంగాణ ఏర్పడితే.. చీకటి అలుముకుంటుందని ఆరోపణలు చేసిన నోర్లు మూయిస్తూ 24 గంటల కరెంటు ఇస్తున్నది. వ్యవసాయరంగం కుదేలై అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతాయంటూ ఆరోపణలు చేసిన వారి కండ్ల ముందే.. ఏకంగా దేశానికే 60శాతంపైగా ధాన్యం ఇచ్చే ధాన్యంగారంగా తెలంగాణ తయారైంది. అన్నదాతలకు అండగా రైతు బంధు, రైతు బీమా వంటివి అమలు చేస్తున్నది. ఉద్యోగులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా వేతనాలు ఇస్తున్నది. అమరవీరులు కలలుగన్న బంగారు తెలంగాణను కండ్ల ముందు ఆవిష్కృతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నది. వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి నీటిని ఒడిసి పట్టి.. నెర్రలు బారిన పొలాల్లో పరుగులు పెట్టిస్తున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడేళ్ల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా విషయాల్లో దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది. ఇంత జరుగుతున్నా తెలంగాణపై.. అదీ రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్ల తర్వాత మోదీ ఎందుకు మాట్లాడుతున్నరు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నో ఉద్యమాలు చేసి.. తెచ్చుకున్న తెలంగాణ ప్రజల అభిప్రాయాలను కించపరిచేలా మోదీ రెండ్రోజులుగా మాట్లాడుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుతున్నాయి. నిజంగా మోదీ మాటలు విన్నాక.. ఇంకా ఆపార్టీలో కొనసాగాలని భావించే నాయకులకు మున్ముందు ప్రజలే బుద్ధి చెబుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు పెరుగుతున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక రాష్ట్రంపై ప్రధాన మంత్రి మోడీ విషం కక్కుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసే సత్తాలేని బీజేపీ నేతలు కేసీఆర్‌పై విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన మంత్రే తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించేలా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు ఇప్పుడేం మాట్లాడుతరు.. స్వరాష్ట్రం మీద విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటే వాళ్లు మనకు నాయకులు ఎట్ల అవుతరు. -అన్సార్, ఉద్యమకారుడు
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉంది. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను అన్ని రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని ప్రధాని రాష్ట్ర విభజన సరిగా జరుగలేదని మాట్లాడుతున్నారు. ఏడేళ్లయినా తెలంగాణపై వారి కుట్రలను ఆపలేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ విషయంలో ప్రధాని అవహేళనగా మాట్లాడుతున్నారు.
– యూనిస్ అక్బానీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,ఆదిలాబాద్
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అతితక్కువ కాలంలోనే అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మిగతా రాష్ర్టాల కంటే ఎంతో ఎత్తులో ఉంది. ఇదే బీజేపీ నాయకులకు ఇష్టం లేదు. ఏడేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ తన దార్శనికతతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. దేశంలో ఎన్నో రాష్ర్టాల్లో ఆయనకు వస్తున్న ఆదరణనే దీనికి నిదర్శనం.
బీజేపీ దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నది. వీరి తీరుతో రానున్న రోజుల్లో మరో ఉద్యమం అవసరమయ్యేలా కనిపిస్తున్నది.
– సాజిద్, ఉద్యమకారుడు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ కుసంస్కారిలా మాట్లాడిన్రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రజలు బీజేపీని నమ్మడం లేదు. ఆ పార్టీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఏడేళ్ల తరువాత విభజన విషయాలను ప్రస్తావిస్తూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నరు. ప్రధానమంత్రి మాట్లాడినట్లుగా ఈ రెండు రాష్ట్రా ల్లో పరిస్థితులు లేవు. రెండు రాష్ర్టాలు అభివృద్ధిలో దూసుకు పోతున్నాయి. ఎక్కడా పెద్దగా గొడవలు జరిగిన సందర్భాలు లేవు. ప్రభుత్వాలు, ప్రజలు సామరస్యంగా ముందుకు సాగుతున్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ సారథ్యంలో గొప్పగా సాగి చివరకు లక్ష్యాన్ని చేరుకున్నం. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నరు. తెలంగాణ పాలనను, ఇక్కడి సంక్షేమ, అభివృధ్ధి పనులను ఇతర రాష్ట్రాల నాయకులు తెలుసుకొని వారి ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నరు. హైదరాబాద్‌కు విదేశీ కంపెనీలు లైన్ కడుతున్నయి. 20 ఏళ్ల క్రితమే తెలంగాణ ఏర్పడితే దేశానికే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవాళ్లం. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పుకునే బీజేపీ, ఆచరణలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నది. అనవరసరంగా విభేదాలు సృష్టించాలని, మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు బుద్ది చెబుతారు.
– గోగుల రవీందర్‌రెడ్డి, ఉద్యమ కారుడు, మంచిర్యాల
తెలంగాణ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తలదించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంపై పనికిరాని మాటలు మాట్లాడుతున్న కమలం పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. ప్రధాని ఎందుకు ఇంత అక్కసు ప్రదర్శిస్తున్నారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ఎన్నో ఏళ్ల పోరాటాలు, ఆందోళనలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ గురించి ప్రధాని నరేంద్రమోడీ ఇష్టానుసారంగా మాట్లాడడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే. కమలం పార్టీ నాయకులు అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి నేర్చుకోవాలి.
-సుభాష్ గాడ్గే, ఉద్యమకారుడు, ముక్రా(కే), ఇచ్చోడ