మందమర్రి, మే 9 : పహల్గాం దాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ సిందూర్‌పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంబురాలు నిర్వహిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారత సైన్యానికి మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభిషేకాలు, అర్చనలు చేయిస్తున్నారు. సైనికా.. విజయోస్తు.. అం టూ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో బీజేపీ శ్రేణులు, వ్యాపారస్తులు సంబురాలు చేశారు. పట్టణంలోని పలు కాలనీల గుండా ర్యాలీ తీశారు. ‘జై భారత్.. జై జవాన్’ అంటూ నినాదాలు చేశారు. పాతబస్టాండ్ చౌరస్తాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ నాయకులు, పాత బస్టాండ్ ఏరియా వ్యాపారస్తుల సంఘం నాయకులు అందుగుల శ్రీనివాస్, వడ్లకొండ కనకయ్య గౌడ్, దీక్షితులు, వినయ్, రంగు శ్రీనివాస్, మార్త కుమార్, కనకయ్య పాల్గొన్నారు.
దండేపల్లి, మే 9 : హైదరాబాద్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
బెల్లంపల్లి, మే 9 : మండలంలోని బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి-శ్రీరాములు ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. యుద్ధంలో ఆర్మీ జవాన్లు, దేశ ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని దేవున్ని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు వారు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, నాయకులు గోవర్ధన్, శ్రావణ్‌కుమార్, వెంకటస్వామి, ఆలయ ఈవో బాపురెడ్డి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, మే 9 : జిల్లా కేంద్రంలోని కేశవనాథస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఒజ్జల నరేశ్ శర్మ, శిరీశ్‌శర్మ అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ పాకిస్తాన్‌పై విరోచిత పారోటానికి దిగిన సైనికులకు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాల్సిన అవసరముందన్నారు. భారత్ మాతాకీ జై.. అం టూ నినాదాలు చేశారు. వైరాగడె మనోజ్, సుగుణాకర్, కాండ్రె విశాల్, గంధం శ్రీనివాస్, రవికుమార్ జోషి, శంకర్రావ్, సురేశ్‌చారి, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, మే 9 : మండల కేంద్రంలోని శుక్రవారం అమ్మవారికి లక్ష్మణచాంద గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జైనథ్, మే 9 : జైనథ్ మండలకేంద్రంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సీ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ రుకేశ్ రెడ్డి, సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మారెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, జైనథ్ పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు గడ్డం జగదీశ్ రెడ్డి, రాజన్న, గంగారెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం, మే 9 : పాకిస్తాన్‌తో జరుగుతున్న యు ద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలని కాంక్షిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని అతి పురాతనమైన మార్వాడీ ధర్మశాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఎదులాపురం, మే 9 : ఆదిలాబాద్ పట్టణంలో న్యాయవాదులు ర్యాలీ తీశారు. జాతీయ జెండాలను చేత పట్టుకొని ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా కోర్టు నుంచి కలెక్టర్ చౌక్ మీదుగా ర్యాలీ తీశారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రా ల నగేశ్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకరం గా సరిహద్దులోని అమాయక ప్రజలపై పాక్ దాడులు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భైంసా, మే, 9 : పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరుడైన ఆర్మీ జవాన్ ఎం. మురళీ నాయక్‌కు హనుమాన్ దీక్షాపరులు సంతాపం తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కిసాన్ గల్లీలో రోకడేశ్వర హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని అంజన్నను వేడుకున్నారు. జవాన్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌పై చేస్తున్న యుద్ధంలో భారత జవాన్లు విజయం సాధించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి కోర్వ చిన్నన్న, స్వాములు కోర్వ శ్రీకాంత్, సంతోష్, నిఖిలి భోజన్న, దత్తాద్రి, కారిగిరి రాజు, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, మే 9 : వీర జవాన్ మురళీనాయక్ మృతికి సంతాపకంగా స్థానిక వినాయక్ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు గ్రామస్తులు, నాయకులు కొవ్వొత్తులతో ర్యా లీ తీసి నివాళులర్పించారు. జడ్పీ మాజీ చైర్మన్ రాథో డ్ జనార్దన్, నాయకులు రితేశ్ రాథోడ్, జగన్, రమేశ్, వెంకటేశ్ నాయకులు ఉన్నారు.