మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో అధికారులకు నిలదీతలు, నిరసన సెగలు తగిలాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామాలు, పట్టణాల్లో వా ర్డులవారీగా సభలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, జిరాక్స్‌ల కోసం జనం పరుగులు తీశారు. దరఖాస్తు ఫారాల కొనుగోలు కోసం రూ.30 వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని దరఖాస్తుదారులు తెలిపారు.
ఇది నిరంతర ప్రక్రియ
జనం నుంచి వ్యతిరేకత రావడం, గ్రామసభల్లో అధికారులను నిలదీస్తున్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో పోలీసులను మోహరించి సభలు నిర్వహించారు. కొన్ని సభల్లో అధికారులతోపాటు పోలీసులు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వచ్చింది ఒక జాబితానేనని, అర్హులందరినీ న్యాయం జరుగుతుందని, ఈ దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని పలుచోట్ల అధికారులు ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేయాలి. ఆరు గ్యారెంటీల కోసం ఒకసారి, సమగ్ర కుటుంబ సర్వేప్పుడు మరోసారి.. ఇప్పుడు గ్రామసభల్లోనూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏంటని జనాలు అధికారులను నిలదీశారు. అసలు చేసిన దరఖాస్తులను పట్టించుకుంటున్నారా? లేదా? ఈసారి గ్రామసభల్లో చేసిన దరఖాస్తులైనా పరిగణలోకి తీసుకుంటారా? లేదా? చెప్పాలంటూ మండిపడ్డారు. ఒక్క పథకానికి ఇన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తూ జనాలు సభల నుంచి వెనుతిరగడం కనిపించింది.
ఆందోళనలు ఇలా..
సభలో కన్నీరు పెట్టుకున్న మహిళ
వాంకిడి మండలంలోని బంబార గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళ నూతి జ్యోతి తన పేరు లేకపొవడంతో గ్రామసభలో కన్నీరు పెట్టుకున్నది. పూరిగుడిసెలో కుమారుడితో ఒంటరిగా ఉంటూ కూలీ పనులు చేసుకునే తనకు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు పారదర్శకంగా సర్వే నిర్వహించి పథకాలు అందేలా చుడాలని కోరింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆరో వార్డులో గల సేవాదాస్ స్కూల్లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ప్రజాపాలనలో ఈ వార్డు నుంచి ఇందిరమ్మ ఇండ్లకు 650 మంది, రేషన్‌కార్డులకు 260 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన గ్రామసభలో 65 మంది రేషన్‌కార్డు లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 143 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రదర్శించారు. రేషన్‌కార్డులను ఈ నెల 26 నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించినా.. ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడుతలో కేవలం ఆరుగురికి మాత్రమే కేటాయించారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వార్డు ప్రజలు మరోసారి దరఖాస్తు ఇవ్వడానికి గ్రామసభలో బారులు తీరారు.
ఇంటి పన్ను కడితేనే దరఖాస్తు తీసుకుంటారట
హాజీపూర్, జనవరి 21 : నాకు వివాహమై ఏడేండ్లు అయితాంది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు, కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాను. ఇంత వరకు రేషన్ కార్డు రాలేదు. నాకు ఇల్లు కూడా లేదు. మా అమ్మా, నాన్న ఇంట్లో ఉంటున్నా, ఇంటి పన్ను ఎనిమిది వేలు బకాయి ఉన్నది. మొత్తం కడితేనే నీ దరఖాస్తు తీసుకుంటానని గ్రామ కార్యదర్శి దరఖాస్తు తీసుకోలేదు. ఇప్పడు డబ్బులు లేవు, మేడం తరువాత కడుతానని చెప్పినా తీసుకోలేదు. అధికారులు నాకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలి.
-చౌతకారి నవీన్, ంనూర్ (హాజీపూర్ )
రేషన్ కార్డులో పేరు రాలేదు..
రేషన్ కార్డుకు నేను అన్ని విధాలుగా అర్హుడిని. నా పేరు లిస్ట్‌లో రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకున్న. ఇలా ప్రతిసారి దరఖాస్తు చేసుకోవడమే తప్ప లిస్టులో పేరు మాత్రం రావడం లేదు. ఇలా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలో అర్థం కావడం లేదు. మాసోంటి గరీబోల్ల పేర్లు కూడా జాబితాలో రాకపోతే ఎలా? ఈ సర్కారు, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.
– మేర భాసర్ దంపతులు
పదేండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నా..
నేను కూలీ పని చేసుకుంటూ ఉపాధి పొందుతా. కష్టపడి పనిచేసి సొంత జాగా కొనుగోలు చేశా. పదేండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్న. నేను ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. ఆదిలాబాద్ మన్సిపాలిటీలో ఆరో వార్డు పరిధిలోకి మా కాలనీ వస్తుంది. ఈ రోజు పెట్టిన లిస్ట్‌లో మా పేరు రాలేదు. అధికారులను అడిగితే మరోసారి దరఖాస్తు ఇవ్వమన్నారు. దరఖాస్తులు జిరాక్స్ సెంటర్లో ఉంటాయని అంటున్నారు.
– సోహల్, ఇందిరమ్మ కాలనీ, ఆదిలాబాద్