భైంసా/భైంసా టౌన్, సెప్టెంబర్ 4 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనం గురువారం అంగరంగ వైభవంగా కొనసాగింది. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర సాగింది. గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టులో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసి వినాయకా.. సెలవిక.. అంటూ వీడ్కోలు పలికారు. కాగా.. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల భైంసాలో మకాం వేసి బందోబస్తు పర్యవేక్షించారు. గణేష్ మండలిల సభ్యులు, యువజన సంఘాల నాయకులు, హిందూ వాహిని, కుల సంఘాలు, ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనాన్ని ప్రారంభించారు.
భైంసా పట్టణంలోని గణేశ్ నగర్లో గల మున్నురుకాపు సంఘ భవనంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాశ్ కుమార్, బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమతి సభ్యులు విలాస్ గాదేవార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, బబ్రు మహారాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, భట్టిగల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తూమోల్ల దత్తు శోభాయాత్ర ప్రారంభించారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద చేరుకున్న వాహనాలను వరుస క్రమంలో అనుమతించి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఏఎస్పీలు ఇద్దరు, సీఐలు 12 మంది, ఎస్సైలు 20 మంది 30 రూప్ టాప్లు, 600ల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 190 గణేశ్ మండలిలు ప్రతిష్టించిన వినాయకులను సీసీ కెమెరాల ద్వారా సమీక్షించారు.