మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటిస్తూ యువహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ముఖ్యంగా ‘బేబీ’ సినిమా ఆయన కెరీర్లోనే ఓ మైలురాయి అని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఎపిక్, డ్యూయెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారాయన. ఆదివారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వేగంగా సినిమాలు చేయడం కంటే క్వాలిటీగా సినిమాలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. చేసే ప్రతి పాత్రకూ వేరియేషన్, ఎంచుకునే ప్రతి కథకూ స్ట్రాంగ్ కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాను.
నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఓ మంచి స్థానాన్ని సంపాదించుకోవడమే నా లక్ష్యం’ అన్నారు ఆనంద్ దేవరకొండ. సితార ఎంటర్టైన్మెంట్స్లో తాను చేస్తున్న ‘ఎపిక్’ సినిమా ఒక విభిన్నమైన ప్రేమకథ అని, కేవలం ప్రమోషనల్ కంటెంట్‌తోనే ఈ సినిమా ఆడియన్స్‌లో బజ్‌ని క్రియేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని, దర్శకుడు ఆదిత్యహాసన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఆనంద్ తెలిపారు. అలాగే మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వంలో తాను చేస్తున్న ‘డ్యూయెట్’ సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని ఆనంద్ పేర్కొన్నారు.