ఎదులాపురం, సెప్టెంబర్ 26 : మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందిపడుతున్నామని, వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలో పంచాయతీ కార్మికులు పని చేస్తున్నారని, ఆ వేతనాలను కూడా మూడు నెలలుగా ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, జీ వో 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో యూనియన్ కోశాధికారి రవి, ఉపాధ్యక్షుడు తారుడి గంగన్న, అశోక్, ప్రమోద్, రామెల్లి గంగన్న, హనుమాండ్లు, మారుతి, శంకర్ తదితరులున్నారు.