ఊరి వీధుల్లో కనిపించే చెత్త.. డంప్ యార్డుల్లోకి చేరడంతో వీధులన్నీ శుభ్రమయ్యాయి. రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. డ్రెయినేజీల్లోని మురుగు కనిపించకుండా పోవడంతో సీజనల్ వ్యాధులు మటుమాయం అయ్యాయి. శ్మశాన వాటికల ఏర్పాటుతో అంతిమ సంస్కారాల అవస్థలు తప్పాయి. ఊరి పొలిమేరల్లో ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రమాదకరంగా వేలాడే విద్యుత్ తీగలను సరిచేయడంతో కరెంటు కష్టాలు సమసిపోయాయి. శిథిలావస్థలో ఉన్న బావులు, భవనాల పూడ్చివేతతో ప్రమాదాలు తప్పాయి. పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ రావడంతో ఊరే మారిపోయింది. పంచాయతీకో నర్సరీ ఏర్పాటుతో హరితవనాలు రూపుదిద్దు కున్నాయి. అంధకారంలో మగ్గుతున్న పల్లెల్లో హైమాస్ట్ లైట్ల వెలుగులు విరజిమ్ముతున్నాయి. పల్లె ప్రగతితో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సమసిపోయాయి. పల్లెవాసుల జీవితాల్లో వినూత్న మార్పులు చోటుచేసుకోగా.. ఆర్థికంగా బలపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘పల్లె ప్రగతి’పై ప్రత్యేక కథనం..
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ)
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. శ్రమదానంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. గ్రామాలకు వచ్చే రోడ్లను బాగు చేసుకున్నారు. హరితహా రంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు నాటారు. గ్రామాలను ఆనుకొని ఉన్న పొదలను తొలగించారు. రోడ్లపై నీటి గుంతల ను పూడ్చి చదును చేసుకున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. యేటా ప్రబలే సీజనల్ వ్యాధులు దూరం కావడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. పంచాయతీలో నర్సరీలు అందుబాటులోనికి రావడంతో హరితహారం మొక్కలు పెంచుతూ యేటా జూలై, ఆగస్టు నెలల్లో మొక్కలు నాటుతున్నారు. ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీని ప్రభుత్వం సమకూర్చడంతో చాలా ప్రయోజనకరంగా మారింది. విద్యుత్ సమస్యలు తీరిపోయాయి. ప్రతి గ్రామానికీ త్రీఫేజ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలు, పిచ్చి మొక్కలు తొలగించడంతో రోడ్లు విశాలంగా మారాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ)
ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడమే లక్ష్యం..
గోలేటి గ్రామ పంచాయ తీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడమే మా లక్ష్యం. పల్లె ప్రగతి నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. సమస్యలు లేకుండా ఉండడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. గ్రామాభివృద్ధిలో ప్రజల సహకారం పూర్తిగా ఉంది. పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కరించుకున్నాం. సద్వినియోగం చేసుకున్నాం.
– పొటు సుమలత, సర్పంచ్, గోలేటి.
మార్లవాయి ఆదర్శ గ్రామంగా ఎంపికైంది..
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే మా మార్లవాయి గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక అయింది. మా గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. పారిశుధ్యం, పచ్చదనం గ్రామంలో వంద శాతం అమలు చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులు వంద శాతం పూర్తి చేశాం. గ్రామంలో అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది.
– కనక ప్రతిభ, సర్పంచ్, మార్లవాయి.