ఇచ్చోడ, సెప్టెంబర్ 9 : స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కదం వనిత, భర్త కదం సుభాష్ దంపతుల చిరునామా ఇచ్చోడకు బదిలీ చేశారు. ఇటీవల అధికారులు గ్రామ పంచాయతీలో ప్రదర్శించిన ఓటరు జాబితాలో వీరి పేర్లు గల్లంతయ్యాయి. ఆరా తీయగా అడిగామ(బీ) 140 పోలింగ్ కేంద్రం నుంచి ఇచ్చోడ మండల కేంద్రంలోని 137 పోలింగ్ కేంద్రానికి గత ఫిబ్రవరిలో మార్చినట్లు గుర్తించారు. దీనిపై బాధితులు కలెక్టర్ రాజర్షి షా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది.
అడిగామ(బీ) గ్రామానికి చెందిన రెవెన్యూ, మీసేవ వారు నకిలీ పత్రాలు సృష్టించి ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి నిందితులు గోస్కుల నితిన్, విశాల్ రాజ్, సింధే అచ్యుత్, కదం ధన్రాజ్, ఇచ్చోడ ఆర్ఐ హుస్సేన్, చిక్యాల సత్యనారాయణను గుర్తించి పలు సెక్షన్ల కింద ఆరుగురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత ఇచ్చోడ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ హుస్సేన్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఇచ్చోడ రెవెన్యూ, మీసేవా కేంద్రాలు అక్రమాలకు అడ్డగా మారాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. గతంలో నకిలీ పెళ్లిళ్ల పేరిట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ డబ్బులు స్వహా చేశారు. ఇతర రాష్ర్టాలకు చెందిన అభ్యర్థులకు నకిలీ చిరునామా పత్రాలు సృష్టించి ఆపై ఆర్మీలో ఉద్యోగం పొందిన దఖలాలు ఉన్నారు. తాజాగా అడిగామ(బీ) మాజీ సర్పంచ్ కదం వనిత దంపతుల చిరునామాను మార్చి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారు. ఇదంతా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ మీ సేవా కేంద్రంలో జరగడాన్ని పోలీసులు గుర్తించారు.