సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఇన్స్పెక్టర్ల అవినీతి అక్రమాల బాగోతంపై ‘నమస్తే’లో శనివారం ప్రచురితమైన కేసుకో రేటు కథనం సంచలనం సృష్టించింది. నగరంలోని పోలీసు వర్గాల్లో ఈ ముగ్గురు ఎవరంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా తమపైనే దాడి చేసిన వారి నుంచి ముడుపులు తీసుకొని వదిలేసి పోలీసుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసిన ఇన్స్పెక్టర్ విషయంలో పోలీసులంతా తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి ఆ పోలీస్‌స్టేషన్ సిబ్బందిలో ధైర్యం నింపాలంటూ సీపీ సజ్జనార్‌ను కోరారు.
పోలీస్‌స్టేషన్ సీసీ ఫుటేజ్‌లో ఇన్స్పెక్టర్పై దాడి చేసిన ఘటన తాలూకు దృశ్యాలు ఉన్నాయని, వాటిని తొలగించే అవకాశం ఉండడంతో అసలేం జరిగిందనే దిశగా ఉన్నతాధికారులు ఆరా తీసి సంబంధిత అధికారితో పాటు దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నమస్తేలో ప్రచురించిన ముగ్గురు ఇన్స్పెక్టర్లలో ఎవరేంటనే దిశగా కూడా ఉన్నతాధికారులు ఆరా తీశారు. వారు గతంలో పనిచేసిన చోట వారిపై ఉన్న రిమార్కులు, వారి అక్రమాల బాగోతాలపై చిట్టా తయారుచేసే పనిలో డీసీపీలు ఉన్నట్లు తెలిసింది. సీపీ సజ్జనార్ ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు ఎస్హెచ్ఓలతో పాటు మరో నలుగురిపై చర్యలకు రంగం సిద్ధం చేశారని, వారంతా ఒక్కొక్కరుగా తమ పరిధిలో చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ వద్ద రిపోర్టు ఉన్నట్లు పోలీసుశాఖలో చెప్పుకొంటున్నారు.

‘నమస్తే’లో వచ్చిన కథనంలో పేర్కొన్న ఇన్స్పెక్టర్లు ఎవరు.. వారు చేస్తున్న దందాపై సీపీతో సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. హత్యకేసులో నిందితులను రక్షించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు పలు భూ, ఆస్తి వివాదాల్లో తలదూర్చి లక్షలు.. లక్షలు ముడుపులు వసూలు చేస్తున్న ఆ ఇన్స్పెక్టర్పై సీపీ ఆరా తీశారని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పాతబస్తీ పరిధిలో ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్ల దందా జరుగుతున్నదని గమనించిన అక్కడి డీసీపీలు వారిపై రిపోర్టు కూడా తయారు చేస్తున్నట్లు తెలిసింది. అయితే బాధితులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని, వారితో మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశాలున్నట్లుగా పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
ఇటీవల కమిషనర్ దృష్టికి బంగారం వ్యవహారం వచ్చిందని, దీనిపై సదరు ఇన్స్పెక్టర్, ఏసీపీలను పిలిచిన సజ్జనార్ సీరియస్‌గా మందలించినట్లు తెలిసింది. బంగారు కొనుగోళ్లు, అమ్మకాలలో రూల్ ప్రకారం నడుచుకోవాలని, అసలే వ్యాపారాలు నడవక అందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్తా పోలీసులంటే బెదిరిపోయే పరిస్థితి తీసుకురావద్దని, ఇది మరోసారి జరిగితే ఊరుకోబోమని హెచ్చరించి పంపించారు. ‘నమస్తే’ కథనంతో మరోసారి వీరి అక్రమాల చిట్టా బయటపడడంతో ఆ ఇద్దరిని రెండురోజుల్లో పిలిపించి మాట్లాడతామని, అవసరమైతే వారిని సస్పెండ్ చేస్తామని కొందరు అధికారులతో సీపీ అన్నట్లు తెలిసింది. సంతోష్‌నగర్, చార్మినార్, మంగల్హాట్, ఐఎస్‌సదన్, చాంద్రాయణగుట్ట .. ఇలా ఇన్స్పెక్టర్లు ఎవరై ఉంటారా అంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరగగా, చివరకు ఆ ముగ్గురెవరో తెలియడంతో గత చరిత్ర, తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని వీరు మారరంటూ పోలీసులే అంటున్న పరిస్థితి ఉంది.
ఈ ముగ్గురి చరిత్ర ఇలా ఉంటే మరికొందరి విషయంలోనూ పోలీసులు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఒక విభాగంలో పనిచేసిన మహిళా ఇన్స్పెక్టర్ తాను పనిచేసిన చోట పెద్ద ఎత్తున అప్పులు చేసింది. అందినకాడికి దండుకున్న ఆ అధికారి తాజాగా ప్రత్యేక విభాగానికి బదిలీ అయ్యారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినవారు ఆమె దగ్గరికి వచ్చి అడిగితే రేపుమాపు అంటూ తిప్పుతున్నారని బాధితులు చెప్పుకుంటున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చిస్తున్నారు. మరో పోలీసు అధికారి తాను కొన్ని కేసులకు సంబంధించి సమస్య పరిష్కరించి సెటిల్ చేస్తానంటూ బాధితుల దగ్గర, అవతలవారి దగ్గర డబ్బులు పట్టించి తీరా ఇటీవల బదిలీ కావడంతో ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని పోలీసులే చెప్పుకొంటున్నారు.
ఇలా పలువురు పోలీస్ అధికారులు శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం, డబ్బే పరమావధిగా పనులు చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కమిషనరేట్ పరిధిలో నలుగురు ఏసీపీలు, ఆరుగురు ఇన్స్పెక్టర్లపై నిఘా విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. చాలా సీరియస్ కేసులుండడంతో పాటు సాక్ష్యాధారాలతో సహా నివేదిక రూపొందించడంతో వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని కమిషనరేట్‌లో మాట్లాడుకుంటున్నారు.