హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగుకు యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. పంటలకు సరిపడా యూరియా సరఫరా కావడంలేదు. గత ఆరేండ్లలో ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఫిబ్రవరిలోనే అత్యంత తక్కువగా యూరియా విక్రయాలు నమోదయ్యాయి. దీంతో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే విమర్శలొస్తున్నాయి.
సాధారణంగా యాసంగి సాగుకు సంబంధించి ఫిబ్రవరిలో యూరియా వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. వరి నాట్లు జోరందుకోవడంతోపాటు ముందుగా నాట్లు వేసిన వరికి రెండో దఫా యూరియా వేయాల్సిన సమయం వస్తుంది. అందుకే మొత్తం సీజన్లో ఈ ఒక్క నెలలోనే అత్యధిక విక్రయాలు జరుగుతాయి. ఇలాంటి కీలక సమయంలో వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేకపోయిం ది. దీంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారు.
ఈ సీజన్ ఫిబ్రవరిలో 1.89 లక్షల టన్నుల యూరియా విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం (2024-25) ఫిబ్రవరిలో అత్యధికంగా నమోదైన 3.13 లక్షల టన్నుల కంటే 1.24 లక్షల టన్నులు తక్కువ. 2023-24 ఫిబ్రవరిలో 2.52 లక్షల టన్ను లు, 2022-23 ఫిబ్రవరిలో 3.09 లక్షల టన్నులు, 2021-22 ఫిబ్రవరిలో 2.71 లక్షల టన్నులు, 2020-21 ఫిబ్రవరిలో 2.40 లక్షల టన్నుల యారియా విక్రయాలు జరిగినట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఏ యాసంగి సీజన్‌తో పోల్చినా ఈ సీజన్లోనే యూరియా విక్రయాలు అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ప్రతి సీజన్లోనూ రైతులు ఒక్క యూరియా బస్తా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం నుంచి రైతులకు అవసరమైన యూరియా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది రైతులకు శాపంగా మారింది. ఎరువుల దుకాణాల వద్ద జాగరణ చేసే దుస్థితి తీసుకొచ్చింది. కొన్నిచోట్ల యూరియా కోసం కొట్లాటలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. దీనికితోడు యూరియా పంపిణీ కోసం యాప్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం రైతులపై మరో పిడు గు వేసింది. దీంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయి. యాప్‌ను అట్టహాసంగా ప్రారంభించిన తొలిరోజే పని చేయకుండా పోయింది.
ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా సాంకేతిక సమస్యలే. ఈ యాప్‌తో యూరియా తీసుకోవడం రైతులకు మరింత సవాలుగా మారింది. ముఖ్యంగా చదువురాని, స్మార్ట్‌ఫోన్ లేని రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. యాప్ లో బుక్ చేసుకోలేక, యూరియా దొరక్క ఆ రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు యూరియా స్టాక్ లేకపోవడం, మరోవైపు యాప్‌తో కష్టాలతో ఉన్న యూరియాను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో గతంతో పోల్చితే యూరియా విక్రయాలు పడిపోయాయనే అభిప్రాయాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఖలీల్‌వాడి/నవీపేట, ఫిబ్రవరి 28: పొలాలు పొట్టకొస్తున్న తరుణంలో యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా బోర్గాం సొసైటీకి శనివారం తరలివచ్చిన రైతులు.. యూరియా లేదని తెలిసి తీవ్ర రోడ్డుపై బైఠాయించారు. యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. జేడీఏ వీరస్వామి అక్కడికి వచ్చి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తక్షణమే ఒక లోడ్ యూరియా తెప్పించి ఇస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఇక, నవీపేట్ మండలం రాంపూర్‌లోని సొసైటీ గోదాం ఎదుట రైతులు ధర్నా చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా నిల్వలతో గోదాం నిండుగా ఉండేదని, ఇప్పుడు స్టాకే ఉంచడం లేదని మండిపడ్డారు.