నమస్తే తెలంగాణ క్రీడా విభాగం ; దేశానికి భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాల కాలంగా సాధారణ జనజీవితమే కష్టతరమైన వేళ అక్కడ్నుంచి యువకులు ఒక ఆటను కెరీర్‌గా ఎంచుకోవడమే ఒక సాహసం. కశ్మీర్ లోయ వెంబడి ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడులు, తుపాకుల మోతలతో ఆ ప్రాంతంలో నిత్యం ఘర్షణ వాతావరణమే ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచీ ఆర్టికల్ 370ని రద్దు (2019) చేసేదాకా ఆ రాష్ట్రం నిత్యం రావణకాష్టంలా మండుతూనే ఉండేది. బంద్‌లు, రాస్తారోకోల వంటి నిరసనలు నిత్యకృత్యమైన చోట ప్రతిరోజూ నిర్బంధ వాతావరణాన్ని ఎదుర్కున్న ఆ ప్రాంతం దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీని సొంతం చేసుకోవడం నిజంగా అద్భుతమే! అయితే ఆ జట్టు విజయం గాలివాటమేమీ కాదు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వెనుక దశాబ్దాల కృషి దాగి ఉంది. ప్రభుత్వాల నుంచి కనీస మద్దతు కరువైనా.. రాజకీయాలు, అవినీతి మరకలతో రాష్ట్ర క్రికెట్ సంఘం భ్రష్టు పట్టినా.. మాజీ క్రికెటర్ల మార్గనిర్దేశకత్వం, బీసీసీఐ దూరదృష్టి, ఆటగాళ్ల కఠోర శ్రమ, సహాయక సిబ్బంది త్యాగాలు వెరసి.. ఆ జట్టు కొత్త చరిత్రను లిఖించింది.
వసతులు లేకున్నా..
దేశం మొత్తం క్రికెట్ మత్తులో ఊగిపోతున్నా జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవంటే నమ్ముతారా? కొద్దిరోజుల క్రితం దాకా ఆ రాష్ట్రంలో శ్రీనగర్‌లో మాత్రమే టర్ఫ్ వికెట్ ఉండేది. ఇతర రాష్ర్టాల మాదిరిగా క్రికెట్ అకాడమీలు, నిష్ణాతులైన కోచ్‌లు, అత్యాధునిక సౌకర్యాలు ఇప్పటికీ అంతంతమాత్రమే. కొన్ని స్కూల్స్‌లో ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడేందుకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తున్నాయి. శ్రీనగర్‌లోని జమ్మూకశ్మీర్ క్రికెట్ అకాడమీ (జేకేసీఏ)లో ఉన్న గ్రౌండ్ మినహా క్రికెట్ ఆడేందుకు సరైన గ్రౌండ్స్ ఇప్పటికీ లేవు. రాష్ర్టానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు టర్ఫ్ వికెట్ మీద ప్రాక్టీస్ చేయాలన్నా ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది.
నిర్బంధాల నడుమే..
సౌకర్యాల లేమికి తోడు ఈ ప్రాంతంలో తరుచూ విధించే కర్ఫ్యూలు రాష్ట్ర క్రికెటర్లకు అతిపెద్ద ప్రతిబంధకం. దేశవ్యాప్తంగా వివిధ టోర్నీలకు ముందు జట్లన్నీ ప్రీసీజన్ టోర్నమెంట్లు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తే జమ్మూకశ్మీర్‌లో మాత్రం 2022 దాకా అలాంటి వాతావరణమే ఉండేది కాదు. కర్ఫ్యూల కారణంగా ఎందరో ఔత్సాహిక క్రికెటర్ల కలలు నిర్బంధాల చీకట్లోనే తెల్లవారిపోయాయి.
బిషన్‌సింగ్ బేడీ రాకతో..
జమ్మూకశ్మీర్ క్రికెట్ గతిని మార్చడానికి మొదటి బీజం భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ రూపంలో పడింది. 2010లో ఆయన ఆ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటిదాకా ఓటమికి పర్యాయపదంగా ఉన్న ఆ జట్టు.. 2013-14 సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. ఆ ఏడాది రంజీ సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్, అశిష్ నెహ్రా, ఇషాంత్ శర్మ వంటి హేమాహేమీలున్న ఢిల్లీని ఓడించినంత పనిచేసింది. ఆ సీజన్లో క్వార్టర్స్ చేరి చరిత్ర సృష్టించింది. 2014-15లో అయితే రంజీ దిగ్గజం ముంబైని వారి సొంతగడ్డపై ఓడించి షాకిచ్చింది. 2019-20 సీజన్లోనూ ఆ జట్టు క్వార్టర్స్ చేరింది. ఆ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో జమ్మూకశ్మీర్ కుర్రాళ్లు ఐపీఎల్ బాట పట్టారు. ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, రసిక్ ఆలం, యుధ్వీర్ సింగ్, తాజా సంచలనం బారాముల్లా ఎక్స్‌ప్రెస్ అకిబ్ నబీ ఇలా గుర్తింపు పొందినవారే..
మన్హాస్ కృషి

దేశవాళీల్లో ఢిల్లీకి ఆడిన జమ్మూ పండిట్ అయిన మిథున్ మన్హాస్.. ఆట నుంచి వైదొలిగాక బీసీసీఐ ఆదేశాలతో జమ్మూకశ్మీర్ క్రికెట్‌ను గాడిలో పెట్టే బాధ్యతను తలకెత్తుకున్నాడు. మన్హాస్ రాకతోనే జిల్లా స్థాయిల్లో ఆటగాళ్ల ఎంపిక, వారికి మెరుగైన శిక్షణా సదుపాయాలను కల్పించడంలో తీవ్రంగా కృషి చేశాడు. ఎర్రమట్టి పిచ్‌లను తయారుచేయించి మెరికల్లాంటి బౌలర్లను తయారుచేయడంలో కీలకపాత్ర పోషించాడు. అజయ్ శర్మను హెడ్‌కోచ్‌గా నియమించడం ఆ జట్టు ప్రయాణాన్ని మరో మైలురాయి ఎక్కించింది. అజయ్, బౌలింగ్ కోచ్ కృష్ణ కుమార్, ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ మార్గనిర్దేశకత్వంలో క్రికెటర్లు రాటుదేలారు. వారి శ్రమకు ఫలితంగా 2024-25వ సీజన్లో క్వార్టర్స్ చేరిన ఆ జట్టు.. ఈ సీజన్లో అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించింది. ఈ సీజన్లో ఆ జట్టు ఎలైట్ గ్రూప్-డీలో ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో క్వార్టర్స్‌కు చేరింది. ఇక నాకౌట్ దశలో భాగంగా క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌ను వారి సొంత మైదానంలో ఓడించిన ఆ జట్టు.. సెమీస్‌లో బెంగాల్‌ను బెంగాల్లో చిత్తుచేసింది. ఫైనల్లోనూ కర్ణాటకపై వారి సొంత రాష్ట్రంలోనే అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
జట్టుగా ఆడి..

సమిష్టితత్వమే జమ్మూకశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీని అందించిందనడంలో సందేహమే లేదు. పేరుకు దేశవాళీలే అయినా ముంబై, మహారాష్ట్ర, విదర్భ, కర్ణాటక వంటి జట్లకు ఆడే క్రికెటర్ల పేర్లు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. కానీ జమ్మూకశ్మీర్‌లో అలా కాదు. ఇతర రాష్ర్టాల గురించి పక్కనబెడితే సొంత రాష్ట్రంలోనూ ఆ జట్టు క్రికెటర్లకు గుర్తింపు అంతంతమాత్రమే. కానీ వాళ్లు ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు. దేశవాళీల్లో పదివేలకు పైగా పరుగులు చేసిన కెప్టెన్ పారస్ డోగ్ర (645 రన్స్) అబ్దుల్ సమద్ (748), శుభమ్ పుందిర్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణించారు. ఇక ఆ జట్టు బలం అంతా బౌలింగే. బంతినందుకున్న ప్రతిసారీ నబీ (10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు) ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఫైనల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటకను దెబ్బతీయడంలో అతడిదే కీలకపాత్ర. రంజీ ప్రదర్శనలతోనే ఐపీఎల్లో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్లో మెరిస్తే అతడు భారత జట్టు తలుపు తట్టడం లాంఛనమే!