పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేయడంతో దేశంలోని పౌరులు, అన్ని పార్టీల నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. పహల్గాంకు ప్రతీకారం తీర్చుకుంటున్నారని, అందులో మృతి చెందిన వారి ఆత్మలు శాంతిస్తాయని పేర్కొంటున్నారు. తాజాగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు, ప్రజలు, రైతులు త్రివిధ దళాలను అభినందించారు. భారత సైనికులు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ర్యాలీలు నిర్వహించారు.
– నిర్మల్ అర్బన్/మంచిర్యాల టౌన్/భైంసా/భీంపూర్, మే 8
సిందూర్ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాల సైన్యానికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు గత నెలలో జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారన్నారు. అభం-శుభం తెలియని అమాయక ప్రజలను చంపడంపై భారత సైన్యం సిందూరం పేరిట ఆపరేషన్ నిర్వహించి ప్రతీకారం తీర్చుకుందని తెలిపారు. ఈ చర్యను యావత్తు భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో సంఘీభావం తెలుపుతున్నాయని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, గాదె సత్యం, తోట తిరుపతి, పడాల రవీందర్ పాల్గొన్నారు.
భారతదేశ సైనికులకు మద్దతుగా వారు విజయం సాధించాలని గురువారం నిర్మల్ పట్టణంలోని నాయుడివాడ హనుమాన్ ఆలయంలో కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అలాగే నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్ కాలనీలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ విజయంపై మోదీ చిత్రపటానికి వీర తిలకం దిద్దారు. ఈ కార్యక్రమంలో మహిళా బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యే రామరావు పటేల్ పాలాభిషేకం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం యువకులు, రైతులు, అన్ని పార్టీల నాయకులు డప్పువాయిద్యాలతో గ్రామమంతా ర్యాలీగా వెళ్తూ జయజయ నాదాలు చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఉగ్రవాదుల అంతానికి భారత్ చర్యలను స్వాగతించారు.
నిర్మల్ పట్టణంలోని నాయుడివాడ హనుమాన్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
మంచిర్యాలలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైన్యానికి మద్దతుగా అభినందనలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు
భీంపూర్ : కరంజిలో బాణసంచా కాల్చుతున్న యువకులు