నిర్మల్, మార్చి 2(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ కలలు సాకారం అవుతున్నాయి. ఆశించిన వర్షాలు కురియకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తలెత్తే ఇబ్బందులతో రైతులు ఆర్థికంగా నష్టపోవద్దన్న ఉద్దేశంతో ఆయిల్ పామ్ సాగును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఫలితంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 3,561 మంది రైతులు ఆయిల్ పామ్‌ను సాగు చేశారు. ఐదేళ్లలో 8,806 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది మరో 3 వేల ఎకరాల్లో తోటలను పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2021-22లో దాదాపు 700 మంది రైతులు 1500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఇందులో 900 ఎకరాల్లో ప్రతి నెల, రెండు నెలలకోసారి దిగుబడులు వస్తున్నాయి.
ప్రస్తుతం ఎకరానికి రెండు నుంచి మూడు టన్నుల గెలల దిగుబడి రావడంతో ప్రియూనిక్ కంపెనీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ.21,546 ధరను కల్పించి ప్రియూనిక్ కంపెనీ కొనుగోలు చేసి సిద్దిపేటలో ఏర్పాటు చేసిన పామాయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. వారం రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటివరకు రూ.67 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఒకసారి గెలలు కోతకొస్తే ప్రతినెల ఒక ఎకరానికి టన్ను దిగుబడి వస్తున్నది.
అంటే ఐదెకరాల్లో ప్రతినెల ఐదు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఇలా ప్రస్తుతం ఉన్న ధరతో లెక్కిస్తే ఐదెకరాల ఆయిల్ పామ్ రైతుకు నెలకు రూ.లక్షకు పైగా ఆదాయం సమకూరుతున్నది. వచ్చే రెండు, మూడేళ్లలో చెట్లు పెరిగి నెలకు ఎకరానికి 3 నుంచి 4 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ధరలు టన్నుకు రూ.19 వేల నుంచి రూ.22 వేల వరకు ఉండడంతో ఏడాది పొడవునా మంచి ఆదాయం సమకూరనున్నది. మొత్తానికి ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఆదాయం షురూ కావడంతో వారిలో ఆనందం రెట్టింపు అతున్నది. కేసీఆర్ కృషితోనే ఆదాయం సమకూరుతున్నదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గుండంపెల్లి శివారులో నాకున్న నాలుగెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన. 2021 సంవత్సరంలో మొక్కలు నాటగా, అవి పెరిగి పెద్దవై గతేడాది జూలై నుంచి గెలలు కోతకు వస్తున్నాయి. మొన్న టి జనవరి వరకు అంటే గత ఏడు నెలల్లో వచ్చిన దిగుబడిని అమ్మగా ఇప్పటి వరకు రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఇవి కాకుండా అంతర పంటలైన మక్క, పత్తి, సోయా ద్వారా అదనపు ఆదాయం సమకూరుతున్నది. ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు దిలావర్పూర్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మా గ్రామంలో ప్రస్తుతం దాదాపు 100 ఎకరాల్లో దిగుబడి వస్తు న్నది. రైతులందరూ కొనుగోలు కేంద్రంలో గెలలను విక్రయిస్తున్నారు. పం టను అమ్మిన వారం రోజుల్లో తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవు తున్నాయి. మొదట్లో టన్నుకు రూ.18 వేలు ఉండగా, ప్రస్తుం రూ.21 వేల కు పెరిగింది. దీంతో మంచి ఆదాయం వస్తున్నది. ఆయిల్ పామ్ మొక్కల ను ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదు. రైతులకు ఇంత స్థిరమైన ఆదాయం వచ్చే పంట మరోటి లేదు. అందుకే రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించారు.
వరి, మక్క, పత్తి సంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ సాగుకు ఖర్చు తక్కువ. ఆదాయం ఎక్కువ. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరి, మక్క, సోయా, పత్తి పంటల కొనుగోళ్లకు సవాలక్ష కొర్రీలను పెడుతున్నది. అదే ఆయిల్ పామ్‌కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు లేవు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులకు గత కేసీఆర్ ప్రభుత్వంలో అందిన విధంగా ప్రోత్సాహకాలు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో అందడం లేదు. ఉద్యానవన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ, పంటను విక్రయించుకునేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు.
– ఎలాల చిన్నారెడ్డి, ఆయిల్ పామ్ రైతు, గుండంపెల్లి.