సంగారెడ్డి బైపాస్ రోడ్డు నాలుగు లేన్ల విస్తరణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. బైపాస్‌రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. ఏండ్ల పాటు పటిష్టంగా ఉండేలా బైపాస్ రోడ్డు పనులు చేపట్టాల్సిస ఉండగా, ప్రారంభ దశలోనే పనులు దెబ్బతింటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి కారణంగా నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పనులు జరుగుతున్న తీరుపై ప్రజలు, వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సంగారెడ్డి బైపాస్ రోడ్డు విస్తరణ పనులు నాసిరకంగా సాగడంపై స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా మంత్రి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు కరవుయ్యాయి.
సంగారెడ్డి, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి కలుపుతూ ఇన్స్పెక్షన్ బంగ్లా నుంచి సాయిబాబా కమాన్ మీదుగా ఎన్‌హెచ్ 65 వరకు బైపాస్ రోడ్డు సుమారు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. బైపాస్ రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో ప్రభుత్వం ఈ రోడ్డును నాలుగు లేన్ల(80 అడుగుల) విస్తరణకు నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ మీడియన్, సైడ్ డ్రెయిన్లు, పేవ్‌మెంట్‌తో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులు విడుదల చేసింది. బైపాస్ రోడ్డు విస్తరణ పనులు బాధ్యతను హెచ్ఎండీకు అప్పగించింది. హెచ్ఎండీఏ టెండర్లు నిర్వహించగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. హెచ్ఎండీఏ విధించిన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణ సంస్థ నాసిరకంగా పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, డబ్బాలు తొలిగించకుండానే 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సెంట్రల్ మీడియన్, పేవ్మెంట్, సైడ్ డ్రెయిన్‌తో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి అంటే, ‘రైట్ ఆఫ్ వే’ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పరిధిలో ఇరువైపులా అనేక ఆక్రమణలు ఉన్నాయి. 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు తప్పనిసరిగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు, డబ్బాలను తొలిగించాల్సి ఉండగా, అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిడి తెచ్చి వాటిని తొలిగించడాన్ని అడ్డుకున్నారు. ఆర్డీవో నివాసం నుంచి సాయిబాబా కమాన్ వరకు కొద్దిమేర అక్రమ నిర్మాణాలు తొలగించారు. మహిళా ప్రాంగణం నుంచి ఎన్‌హెచ్-65 వరకు ఇంకా అక్రమ నిర్మాణాలు, డబ్బాలు అలాగే ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారి అక్రమ నిర్మాణాలు, డబ్బాల జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంలో కఠినంగా ఉండాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. పూర్తిగా అక్రమ నిర్మాణాలు, డబ్బాలు తొలిగించకుండానే బైపాస్ విస్తరణ పనులు మొదలు పెట్టారు. రైట్ ఆఫ్ వే పూర్తిగా ఖాళీగా లేనప్పటికీ, పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ, పేవ్మెంట్ పనులు చేపట్టారు. దీంతో ప్రతిపాదిత 80 అడుగుల రోడ్డు విస్తరణ, నాలుగు లేన్ల విధానాన్ని సక్రమంగా అమలు చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కాంట్రాక్టరు అక్రమ నిర్మాణాలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న డబ్బాలను తొలిగించకుండానే విస్తరణ పనులు ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి బైపాస్ రోడ్డులో కరెంటు స్తంభాలు ఉండగానే, రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. నిబంధనల మేరకు విస్తరణకు ఆమోదించినా.. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్లైన్లు తొలిగించిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలి. విద్యుత్ స్తంభాలు ఉండగానే రోడ్డు, పేవ్మెంట్ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదించిన స్థలంలో అనేచోట్ల ఇంకా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. విస్తరణలో పనుల్లో భాగంగా దట్టమైన కంకర,సిమెంటు మిశ్రమం(డీజీబీఎం)తోపాటు తారు రోడ్డు వేశారు. తారు రోడ్డు మధ్యలోనే అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు ఇంకా ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయం నుంచి యూనియన్ బ్యాంకు వరకు తారురోడ్డు వేసిన తర్వాత విద్యుత్ స్తంభాలు తొలిగించారు. దీంతో చాలాచోట్ల వేసిన బీటీరోడ్డు దెబ్బతింది. కొన్నిచోట్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను ఇంకా పూర్తిగా తొలిగించలేదు.
సంగారెడ్డి బైపాస్ రహదారి విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. రహదారి విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు జరగాల్సి ఉండగా, ఏకకాలంలో రోడ్డు విస్తరణ పనులు సాగడం లేదు. ఇది వరకు ఉన్నరోడ్డుకు ఇరువైపులా సరైన విస్తరణ, కాంపాక్షన్ గట్టిపరచడం లేకుండానే గ్రాన్యులర్ సబ్-బేస్, వెట్ మిక్స్ మాకాడమ్ (జీఎస్బీ మరియు డబ్ల్యూఎంఎం) లేయర్ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ ప్రాంతాల్లో అనేక చోట్ల, నిర్ణీత పేవ్మెంట్ విస్తరణను పాటించడం లేదు. సరైన కాంపాక్షన్ నిర్థారించుకుండానే సబ్-బేస్ పొరలైనా జీఎస్బీ, వెట్ మిక్స్ వేసి రోడ్డు పనులు చేపట్టారు. పేవ్మెంట్ పనులు నాసిరకంగా చేపట్టడంతో తక్కువ సమయంలోనే రోడ్డు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
ఇది వరకే చాలాచోట్ల రోడ్డు పనులు దెబ్బతినడంతో పాటు పేవ్మెంట్ కుంగిపోతున్నది. నిబందనల మేరకు సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టలేదు. సైడ్‌డ్రెయిన్లు లేకుండానే రోడ్డు విస్తరణ, బీటీ పేవ్మెంట్ వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా రోడ్డు, పేవ్మెంట్ ఉన్నచోట వర్షం నీరు నిలిచిపోతుంది. వర్షంనీరు నిలిచిపోవడంతో ఇలాగే కొనసాగితే కొత్తగా వేసే బీటీ పేవ్మెంట్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ నిబంధనల మేరకు పనులు చేపట్టం లేదు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం, హెచ్ఎండీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి అధికారులు రోడ్డు విస్తరణ పనుల వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.