సిటీ బ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీలాంఛ్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సిటీ జనం పట్టించుకోవడం లేదు. రూ.10 వేల టోకెన్ అమౌంట్‌తో పాటు రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధనలు పెట్టడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముఖం చాటేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలకు 60 వేలకు పైగా ఉచితంగా పంపిణీ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించి పంపిణీకి సిద్ధంగా ఉంచిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇప్పటికాదా కనీసం 4 వేలను కూడా పంపిణీ చేయలేదు.
కానీ నిరుపేదలు రూ.6 లక్షలు చెల్లిస్తే లక్ష ఇండ్లను కట్టించి ఇస్తామని ప్రకటనలు చేసింది. కేసీఆర్ కట్టించిన ఉచిత ఇండ్లను ఇవ్వకుండా పేదల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా దోచుకుంటామంటే.. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు. పైలెట్ ప్రాజెక్టు కింద 7,340 ఇండ్ల నిర్మించి లాటరీవిధానం ద్వారా పంపిణీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు. కానీ కేవలం 35,125 దరఖాస్తులే రావడంతో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు కంగుతింటున్నారు. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నా ప్రజలు దరఖాస్తు చేసుకోకపోవడంతో షాక్‌కు గురవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు డబ్బులున్నవారేనని తెలుస్తున్నది. ఈ పథకాన్ని ప్రకటించకముందు నగరంలోని నిరుపేదలు ఇప్పటి వరకు ఉచితంగా ఇస్తామన్న ఇందిరమ్మ, డబుల్ బెడ్రూం ఇండ్లకు 8 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు.
సిటీ జనం చూపు డబుల్ బెడ్రూం ఇండ్ల వైపు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల దాకా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయకుండా పక్కకు పెట్టినా సిటీజనం వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా… ప్రీలాంచ్ విధానాన్ని తెచ్చినా ఇప్పటికీ డబుల్ బెడ్రూం ఇండ్లకే దరఖాస్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దాదాపు 3 లక్షలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ కలెక్టరేట్ హౌసింగ్ విభాగం, ప్రజావాణికి వరుస కడుతున్నారు.
కానీ కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్ కట్టించిన నాణ్యమైన డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తమ అనుచరులకు కట్టబెడుతున్నారు. సిటీలోని నిరుపేదలకు మాత్రం రూ.6 లక్షలు చెల్లిస్తే ఇందిరమ్మ ఇండ్ల పేరిట సింగిల్ బెడ్రూం ఇండ్లిస్తామని పథకాన్ని ప్రారంభించారు. కానీ ప్రజలెవరూ కాంగ్రెస్ ప్రభుత్వ మాటలను నమ్మడం లేదు. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కనీసం ఐదుగురు కూడా దరఖాస్తు చేసుకోలేదు. దీంతో కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రీలాంచ్ విధానాన్ని నగర ప్రజలు తిరస్కరిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు
ఖైరతాబాద్ 4,394, అంబర్ పేట 2,357, బహదూర్ పుర -1,135, ఇబ్రహీం పట్నం -749, కూకట్ పల్లి -5,233, కార్వాన్ -1,574 మహేశ్వరం -471, మలక్ పేట -2,846, మలాజిగిరి-1,033, మేడ్చల్-1,153, నాంపల్లి-3,613, సనత్ నగర్ -1,046 , కుత్బుల్లాపూర్-4,121, రాజేంద్రనగర్- 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -1,374, శేరిలింగంపల్లి-2,530 మంది ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు హౌసింగ్‌బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు.