నిర్మల్ అర్బన్/ భైంసా, మార్చి 12 : బల్దియాలకు ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన మార్గాలైన పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. ఇందులో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాలున్నాయి. అన్ని మున్సిపాలిటీలకు ప్రధానంగా పన్ను వసూళ్ల ద్వారానే ఆదాయం సమకూరుతున్నది. ఆయా పట్టణాల ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నది. వాటితో జిల్లాలోని అన్ని వార్డులను అభివృద్ధి పర్చింది. ప్రత్యేకంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు ప్రతి నెలా నిధులను మంజూరు చేస్తున్నది. వీటితో పాటు పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వచ్చి ఆదాయంతో ప్రజావసరాలు మెరుగుపర్చే అవకాశం ఉంటుంది.
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి
పన్ను వసూళ్లపై బల్దియా అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలైన నిర్మల్, బైంసా, ఖానాపూర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొండి బకాయిలపై ప్రధాన దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలకు పన్ను చెల్లించని వారి జాబితాను సిద్ధం చేశారు. వీరు గతంలో కూడా పన్నులు చెల్లించకపోవడంతో మున్సిపల్ అధికారులు వినూత్న రీతిలో వసూలుకు చేయించారు. రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.50 లక్షల వరకు మొండి బకాయిలున్న వారి జాబితాను ఫ్లెక్సీ రూపంలో బల్దియా ఎదుట ఏర్పాటు చేశారు. దీంతో వారు పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఇలా అన్ని మున్సిపాలిటీల్లో ఈ నెల 31 వరకు వందశాతం పన్ను వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక టీంలతో నోటీసులు జారీ
జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. నిర్మల్లో 42 వార్డులకు గాను ఏడు టీంలను ఏర్పాటు చేయగా.. ప్రతి టీంలో ముగ్గురు చొప్పున సిబ్బంది ఉన్నా రు. ఖానాపూర్లో 12 వార్డులుండగా.. మూడు టీంలతో అధికారులు పన్నులు వసూలు చేయిస్తున్నారు. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులుండగా.. ఆరు టీంలతో ఇంటింటికీ తిరుగుతూ డిమాండ్ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగకుం డా ఇంటి వద్దే పన్నులు వసూలు చేస్తున్నారు. డిమాండ్ నోటీసుల ఆధారంగా అందులో పేర్కొన్న నగదును మున్సిపల్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం బిల్ కలెక్టర్ల వద్ద గానీ, మున్సిపల్ కార్యాలయం, మీసేవ, ఈసేవ కేంద్రాలు, ప్రత్యేక యాప్ల ద్వారా చెల్లించుకునే అవకాశం కల్పించారు.
రెడ్ నోటీసులు జారీ
మున్సిపల్ పరిధిలోని ఆయా కేటగిరీల కింద కమర్షియ ల్, నాన్ కమర్షియల్ పరిధిలో సకాలంలో పన్ను చెల్లించని వారికి, మొండి బకాయిదారులకు అధికారులు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారు సకాలంలో పన్నులు చెల్లించాలని అధికారులు సూ చించారు. సాధారణ ప్రజల నుంచి నిత్యం పన్ను వసూలు చేస్తూ రెడ్ నోటీసులు అందుకున్న వారు పన్ను చెల్లించ కుంటే వాణిజ్య సముదాయాలను సీజ్ చేస్తున్నారు.
ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం
జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల పరిధిలో పన్ను చెల్లింపుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వ్యాపారులు, ఇంటి యజమానులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తులను సైతం జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పన్ను చెల్లించాలని రెడ్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఉలుకూ పలుకూ లేని వారి వాణిజ్య సముదాయాలను నిర్మల్ పట్టణంలో సీజ్ చేశారు. అయినప్పటికీ పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తాం..
నిర్మల్ మున్సిపల్ పరిధిలోని 42 వార్డుల్లో పెండింగ్లో ఉన్న పన్నులను 100 శాతం మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటికే 42 వార్డుల్లో ఏడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాం. వాటిని సకాలంలో చెల్లించాలని రెడ్ నోటీసులు సైతం పంపంచాం. సకాలంలో పన్నులు చెల్లింకుంటే దుకాణాలను సీజ్ చేస్తాం, పద్ధతి మార్చుకోకపోతే ఆస్తులను జప్తు చేస్తాం. పట్టణ ప్రజలందరూ మార్చి 31లోగా పన్నులు చెల్లించి పుర అభివృద్ధికి పాటుపడాలి.
– గంగాధర్, మున్సిపల్ రెవెన్యూ అధికారి, నిర్మల్
లక్ష్య సాధన దిశగా..
ఆస్తి పన్ను వసూలు వందశాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించాం. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది బకాయిలు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. పట్టణ వాసులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, భైంసా