కుభీర్, ఆగస్టు 18 : మండల కేంద్రం కుభీర్ లోని ప్రధాన కూడలి (చౌక్) గత కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతోంది. పట్టించుకునే నాధుడు లేక ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో ఈ కూడలి అత్యంత ప్రధానమైనది. కుబీర్తో పాటు కస్ర, కస్ర తండా, రాజురా జుండా, పార్డి (కే), పార్డి (కే) తాండ, పల్సి, పల్సితాండాల ప్రజలు ఈ చౌక్ లోనే బస్సు దిగి వారి వారి గ్రామాలకు వెళ్తుంటారు. చాలా మటుకు బైంసాతో పాటు నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, నాందేడ్ పట్టణాలకు ఆసుపత్రులకు వెళ్లి నైట్ హాల్ట్ బస్సు, కుబీర్ వరకు వివిధ ప్రైవేట్ వాహనాల్లో వచ్చి ఇక్కడే దిగి వారి వారి గ్రామాలకు వెళ్తుంటారు.
ఈ చౌక్‌లో కొన్ని నెలలుగా హైమాస్డ్ లైట్లు వెలగగా పోవడంతో వీధి కుక్కలు పలువురు ప్రయాణికుల మీద దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బస్సు దిగిన ప్రయాణికులు చౌక్‌లో వారి ఇంటి నుండి ద్విచక్ర వాహనం, ఆటో వచ్చేవరకు వేచి ఉండాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కుభీర్ మేజర్ పంచాయతీ అధికారులకు పలువురు ఈ విషయమై విన్నవించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యుత్ వెలుగులు లేకపోవడంతో ఆ గ్రామాల ప్రయాణికులకు రాత్రి వేళలో భద్రత కరువైంది. వెంటనే మండల పంచాయతీ అధికారి స్పందించి వివేకానంద చౌక్‌లో ఉన్న హైమాస్డ్ లైట్లకు మరమ్మతులు చేయించి ఆయా గ్రామాల్లో ప్రజలకు ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీ మోహన్ సింగ్‌ను వివరణ కోరగా కుభీర్ పంచాయతీ కార్యదర్శికి చెప్పి వెంటనే మరమ్మతులు చేయిస్తానని తెలిపారు.