నిర్మల్ : సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని దివ్యానగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ బోధనలు బంజారా జాతి పురోగమానానికి ఎంతగానో ఉపయోగ పడ్డాయని పేర్కొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి, తండాల నిర్మాణానికి సేవాలాల్ తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. సేవాలాల్ బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. స్వరాష్ట్రంలో గిరిజనుల వికాసం సాధించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్(CM KCR) గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. స్వయం పరిపాలన విధానాన్ని అమలు చేసి గిరిజనులకు రాజ్యాధికారం దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను దేశంలో ఎక్కడ లేని విధంగా అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు.