పెంబి: నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ ద్వారా మండలంలోని జంగంగూడ గ్రామపంచాయతీ పరిధి కొలంగూడ గ్రామంలో 8 ఇండ్లు, తాటిగూడ గ్రామపంచాయతీలోని కొలంగూడలో 10 ఇండ్లు, పుల్గంపాండ్రిలో 6 ఇండ్లు, దయ్యాలమద్ధి గ్రామంలో 9 ఇండ్లు మంజూరయ్యాయి. ఒక్కొక్క ఇల్లుకు రూ.2.5 లక్షలు మంజూరయ్యాయి.
ఇందులో భాగంగా జంగంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొలంగూడలో 8 ఇండ్లు పిల్లర్లు వేశారు. అయితే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో పిల్లర్ల దశలో ఇండ్లు నిలిచిపోయాయి. మిగతా గ్రామాలలో భూమిపూజా చేసి ఆపేశారు. ఇండ్ల నిర్మాణ పనులను మధ్యంతరంగా నిలిపివేయాడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి ఇండ్లు నిర్మించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.