కుభీర్, ఆగస్టు 25 : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో తాసిల్దార్ శివరాజ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా నాయకులు పండిత్ జాదవ్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రంలోని వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ఎకరాకు 25 వేల నష్టపరిహారం అందించాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను పొడిగించేందుకు బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి ఎన్. వైద్యనాథ్, కందూరి చిన్న సాయినాథ్, రాథోడ్ కమలేష్, రాథోడ్ శంకర్ పాల్గొన్నారు.