కుభీర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ సోమవారం మండల జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో తహసీల్దార్ శివరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందించాలని కోరారు.
ఆపద కాలంలో జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకుగాను భీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించేలా జీవోను జారీ చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ చెప్పారు. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు ఎంఏ గఫూర్, మైనోద్దీన్, విట్టల్, చిమ్మన్ రవికుమార్ తదితరులు ఉన్నారు.