ఖానాపూర్ టౌన్ ఫిబ్రవరి 5 : పాలనలో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం 2005ను( Right to Information Act) రూపొందించారు. స.హ చట్టం ప్రకారం అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేసి దానిపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయించి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలి. కానీ, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నిర్లక్ష్యంతో(Authorities negligence) ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు రూపొందించిన చట్టం నీరుగారి పోతున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స.హా చట్టం బోర్డులేవి ఏర్పాటు చేయలేదు.
మరికొన్ని కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని కార్యాలయాల్లో అధికార పేర్లు లేకుండానే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే తహసిల్ కార్యాలయంలో అసలు స.హ చట్టం బోర్డు లేకపోవడంతో ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియక దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. మండల విద్యా వనరుల కేంద్రంలో కేవలం ఒక అధికారి పేరు మాత్రమే ఉంచి మిగతా అధికారుల పేర్లు లేకుండానే బోర్డు దర్శనమిస్తున్నది. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స.హ. చట్టం బోర్డులు ఏర్పాటు చేసి సామాన్యులను చైతన్యవంతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.