నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 16 : స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 2020-21 ఆడిట్ అభ్యంతరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆడిట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఆయా శాఖల్లో ప్రభుత్వపరంగా నిధులు వస్తున్నందున అవి సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆడిట్‌ను నిర్వహించి తప్పుల్లేకుండా చూసుకోవాలని కోరారు. ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖలు ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, ఆడిట్ అధికారి విజయ, డీపీవో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, ఫిబ్రవరి 16 : ఖానాపూర్ మున్సిపల్ 2022-23 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను బుధవారం ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.11.36 కోట్లుగా ప్రతిపాదించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేందర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో గుర్తించిన పనులను మున్సిపల్ పాలకవర్గం దశలవారీగా పూర్తి చేసినట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శానిటేషన్, ప్రతినెలా కార్యక్రమాల అమలు కోసం రూ.11.36 కోట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. పట్టణంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు మున్సిపల్ కౌన్సిలర్లు కృషి చేయాలని వివరించారు. రోడ్డు వెడల్పునకు పట్టణంలోని కబ్రస్థాన్, వేంకటేశ్వర ఆలయ సమస్య ఉన్నట్లు పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. మున్సిపాలిటికీ రెగ్యులర్ కమిషనర్, టీపీవో, పారిశుధ్య కార్మికుల కొరత ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పునకు రూ.16 కోట్లు విడుదల కాగా, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చైర్మన్ రాజేందర్ తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఖానాపూర్ మున్సిపల్ వార్షిక బడ్జెట్‌ను సమావేశంలో మొత్తం రూ.11.36 కోట్ల్లుగా అంచనా వేశారు. అందులో గ్రాంట్, నాన్ గ్రాంట్ల కింద ఖర్చుచేయడానికి పద్దుల కింద ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో అంచనా వ్యయాన్ని అవుట్ సోర్సింగ్ జీతాలకు రూ.70 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు రూ.30.30 లక్షలు, 10 శాతం గ్రీన్ బడ్జెట్ రూ.48.41 లక్షలు, ఇతర నిర్వహణకు వ్యయం రూ.34.39 లక్షలు, 1/3 మిగులు బడ్జెట్ కేటాయింపునకు రూ.2.52 లక్షలు, వార్డుల వారీగా అభివృద్ధి పనుల కోసం రూ.5.05 లక్షలుగా ప్రతిపాదించారు. అంచనా అదాయ వ్యయం.. పన్నుల ద్వారా ఆదాయం రూ.93.18 లక్షలు, అసైన్డ్ రెవెన్యూ ఆదాయం రూ.3 లక్షలు, పన్నేతర ఆదాయం రూ.108 లక్షలను బడ్జెట్లో పొందుపర్చారు. ఈ బడ్జెట్‌ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, కౌన్సిలర్ కావలి సంతోష్, కారింగుల సంకీర్తన, జన్నారపు విజయలక్ష్మి, నాయిని స్రవంతి, పరిమి లత, ఆఫ్రీనాబేగం, తొంటి శ్రీనివాస్, రాజూరా సత్యం, ఫౌజియాబేగం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అంజాద్‌ఖాన్, బండారి కిశోర్, కమిషనర్ జాదవ్ సంతోష్, ఏఈ తిరుపతి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, నాయకులు షబ్బీర్ పాషా, పరిమి సురేశ్, నాయిని సంతోష్ పాల్గొన్నారు.