నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 16 : లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో హైదరాబాద్‌కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అజీజ్ అలియాస్ కరీం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నేండ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నిర్మల్‌కు వచ్చాడు. ఇక్కడ విలాస్‌తో పరిచయం ఏర్పడింది. అక్కాపూర్ గ్రామ సమీపంలో భూమి ఉందని చెప్పడంతో అశోక్, సత్యనారాయణతో కలిసి ఈ నెల 12న నిర్మల్‌కు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. ఎనిమిదెకరాల భూమి సత్యనారాయణ పేరిట ఉండడంతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అతడిని భయపెడితే కలిసొస్తుందని విలాస్ చెప్పాడు. దీంతో సత్యనారాయణను బెదిరించాలని హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం, యూసుఫ్ ఖాన్, బానోత్ పవన్ కళ్యాణ్‌ను అజీజ్ ఒప్పించాడు. వారి పథకం ప్రకారం సత్యనారాయణను హైదరాబాద్‌కు రప్పించారు. మేడ్చల్ వద్ద తమ కారులో ఎక్కించుకొని డ్రైవర్‌ను పంపించారు. రూ.కోటి ఇవ్వాలని సత్యనారాయణను బెదిరించి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా.. రూ.50 లక్షలు, ఆ తర్వాత రూ.20 లక్షలు, చివరకు రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రూ.3 లక్షల నగదు, రూ.5 లక్షల చెక్కును కిడ్నాపర్లకు ఇవ్వడంతో సత్యనారాయణను వదిలివేశారు. ఈ విషయమై సత్యనారాయణ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పట్టణ సీఐ శ్రీనివాస్ ప్రత్యేక బృందాలతో సెల్ నంబర్ ఆధారంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కారు, కత్తి, సెల్ఫోన్లు, రూ.3.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, వెంకట రమణ, కానిస్టేబుళ్లు మన్సూర్, రాజేశ్వర్, వెంకటేశ్‌ను అభినందించారు. వీరికి త్వరలోనే రివార్డులు అందిస్తామని డీఎస్పీ తెలిపారు.