ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది వేరే దారి అన్నట్టుగా ప్రపంచాభిప్రాయాలకు విరుద్ధంగా ఇరాన్ మీదకు అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి ఉరికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ ఆ యుద్ధానికి సరైన కారణాలను చెప్పలేకపోయారు. బాహాటంగా వెల్లడించకపోయినా యుద్ధం వెనుక అసలు లక్ష్యాలు ఇజ్రాయెల్‌ను సురక్షితం చేయడం, చమురుపై ఆధిపత్యాన్ని విస్తరించుకోవడం అని ఎవరికివారు ఓ అంచనాకు వచ్చారు. గంటలు, రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం.. ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తుండటంతో వారాలకు విస్తరిస్తున్నది. ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలపై అమెరికా దాడులు, ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడులతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇదం తా ఒకెత్తు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఉక్కుపాదం మోపడం మరో ఎత్తు. ప్రపంచ వాణిజ్య నౌకాయానానికి ఆ జలసంధి అత్యంత కీలకమైనది.
భారత్ చమురు దిగుమతుల్లో మొన్నటిదాకా 40 శాతం హోర్ముజ్ నుంచే రవాణా అయ్యేది. అలాగే మనకు అవసరమైన 90% సహజవాయువు కూడా హోర్ముజ్ మీదుగా రావాల్సిందే. అమెరికా దాడులతో తీవ్ర ఒత్తిడికి గురైన ఇరాన్ హోర్ముజ్ ను మూసేసింది. నౌకలపై దాడులు జరిపింది. ఇండియాలో వంటగ్యాస్ కొరత సృష్టించిన అల్లకల్లోలం హోర్ముజ్ ప్రతిష్టంభన పర్యవసానమే అనేది తెలిసిందే.
అగ్రరాజ్యం దుందుడుకు విదేశాంగ విధా నం స్థిరత్వాన్ని అందించేందుకు బదులుగా పూర్తి విరుద్ధమైన ఫలితాన్నిచ్చింది. అమెరికా ఆధిపత్యాన్ని మళ్లీ స్థిరపరిచే లక్ష్యంతో మొదలుపెట్టిన యుద్ధం ఒక వ్యూహాత్మక వైఫల్యం గా పరిణమించింది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి, దేశాలు సులభంగా బయటపడే మార్గాల కోసం వెతికేలా చేసింది. యుద్ధం మొదలయ్యేందుకు ముందు ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు తెలుపడం వంటి చర్యల ద్వారా భారత నాయకత్వం దౌత్యపరమైన తప్పటడుగులు వేసినప్పటికీ, భారత ప్రజలతో గల దీర్ఘకాలిక మైత్రీ సంబంధాల దృష్ట్యా మన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లోంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. కానీ అనాలోచిత విధానాలతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొనే అవకాశాన్ని తనకు తానుగా జారవిడుచుకున్నది.
దశాబ్దాలుగా హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గంగా ఉన్నది. ఆ జలాల్లో ప్రయాణించాలంటే నియంత్రణలు, దౌత్యం మధ్య ఒక సున్నితమైన సమతుల్యత అవసరం. అయితే, ట్రంప్ మొదలుపెట్టిన అనాలోచిత యుద్ధానికి హోర్ముజ్‌లో పీటముడి పడింది. స్పష్టమైన దౌత్యపరమైన విధానాలు అనుసరించకుం డా, అంతర్జాతీయ సూత్రాలు, ఐక్యరాజ్యసమితి వంటి బహుళపక్ష వేదికలను బేఖాతరు చేస్తూ కేవలం సైనిక ఆధిపత్యవాదంతో ముందుకు ఉరికి, ప్రాంతీయ ఉద్రిక్తతను తీవ్రమైన ప్రపంచ సంక్షోభంగా మార్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా చేయాల్సిందంతా చేసి చతికిలబడి, ప్రపంచ దేశాలను హోర్ముజ్ పైకి దండెత్తి రమ్మని అమెరికా అధ్యక్షుడు బేలగా పిలుపు ఇచ్చినా అది తమ యుద్ధం కాదంటూ అమెరికా మిత్రదేశా లు విజ్ఞతను చాటుకున్నాయి. ఇరాన్ యుద్ధం లో తలదూర్చేందుకు ఏ ఒక్క దేశమూ ముం దుకు రాకపోవడం అమెరికా ఏకాకితనం మ రింతగా పెంచింది. ఓవల్ ఆఫీసులో కూర్చుం డి ట్రంప్ ప్రపంచ చమురు సరఫరా గొలుసు తో జూదం ఆడటం పూర్తిగా బెడిసికొట్టింది.
అన్నిటికన్నా బహుళపక్ష అంతర్జాతీయ దౌత్య వ్యవస్థ ఈ యుద్ధం వల్ల ఎక్కువగా దెబ్బతిన్నదని చెప్పాలి. ఏకపక్షంగా, తరచూ అనూహ్యంగా వ్యవహరించడం ద్వారా, దీర్ఘకాలిక సముద్ర భద్రతకు సహకారం అత్యంత అవసరమైన అంశంలో లండన్ నుంచి టోక్యో వరకు పాతమిత్రులను, భాగస్వాములను అమెరికా దూరం చేసుకున్నది. అంతర్జాతీయ జలమార్గాలను ఒక దేశ అధ్యక్షుడు తన వ్యక్తిగత చదరంగంలా భావించినప్పుడు, ప్రపంచం అమెరికాను శాంతిభద్రతలకు హామీదారుగా చూడటం మానేసి, అస్థిరతకు మూలంగా చూడటం మొదలుపెట్టింది. అమెరికా యుద్ధకాంక్ష శత్రువులను ఎగదోసి, మిత్రులను దూరం చేసుకునే అవివేకంగా మిగిలిపోయింది. హోర్ముజ్‌పై దౌత్య మధ్యవర్తిత్వానికి యూరోపియన్ యూనియన్ ముందుకు రావడం ముదావహం. ఒక ‘ఘోర పరాజయం’ పెనువిపత్తుగా మారకముందే, ‘సంపూర్ణ విజయం’ గురించిన కల్లబొల్లి కబుర్లను అమెరికా పక్కన పెట్టాలి. నిఖార్సయిన, ఆడంబరం లేని ప్రాంతీయ దౌత్యకృషిని భారత్ మొదలుపెట్టడం తక్షణ అవసరం.