హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాం తాల్లోని ఫుట్‌పాత్‌లపై వ్యాపార కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లపై వ్యాపార సంస్థలకు అనుమతులు ఇవ్వడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని పేరొంది. ఈ అనుమతులు ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో స్పష్టం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)ను ఆదేశించింది. మెట్రో స్టేషన్ల సమీపంలోని ఫుట్‌పాత్‌లపై కియోస్లు, వాణిజ్య స్టాళ్ల ఏర్పాటును సవాలు చేస్తూ బీ అఖిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఈఎస్ఐ దవాఖాన, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు.
పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లపై వ్యాపార స్టాళ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతున్నదని వి వరించారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై హెచ్ఎంఆర్ఎల్ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. మెట్రో ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రయాణేతర ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలకు అ నుమతులు ఇచ్చినట్టు తెలిపారు.
సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందిన తర్వాతే కియోస్లు ఏర్పాటు చేశామని, పాదచారుల రాకపోకలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. జీవో 73 ఆధారంగానే అనుమతులు మంజూరు చేసినట్టు పేరొంటూ.. ఆ జీవో ప్రతిని సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. అనంతరం పిటిషనర్ సమర్పించిన ఫొటోలను జస్టిస్ శ్రవణ్‌కుమార్ పరిశీలించి, కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఫొటోలను బట్టి చూస్తే వ్యాపార కార్యకలాపాలు ఫుట్‌పాత్‌లపైనే కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ మహానగర మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసం మాత్రమే ఉద్దేశించినవని, వాటిపై ఆక్రమణలను అనుమతించరాదని స్ప ష్టం చేశారు.
ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని హైకోర్టు గతంలో పలుమార్లు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సాధారణ పాదచారులు, మెట్రో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా ఫుట్‌పాత్‌లపై అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో పరిశీలించాల్సి ఉన్నదని పేర్కొంటూ.. జీవో 73 ప్రతిని, దాని ఆధారంగా వ్యాపార సంస్థలకు మం జూరు చేసిన అనుమతుల వివరాలను సమర్పించాలని హెచ్ఎంఆర్ఎల్ను ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చే అధికారం ఏ నిబంధనల ద్వారా సంక్రమించిందో, దానికి చట్టబద్ధత ఉన్నదో లేదో తేల్చుతామంటూ తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేశారు.