హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : సుస్థిర మైనింగ్‌లో సింగరేణి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ -2 ఓపెన్‌కాస్ట్ గని మూసివేతలో కేంద్ర బొగ్గుశాఖ నిబంధనలను సంస్థ విజయవంతంగా అమలు చేసింది. ఈ గని మూసివేతలో పర్యావరణ ప్రమాణాలు అమలు చేసినందుకు గాను సంస్థను కేంద్రం ప్రశంసించింది. దీంతో గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సొమ్ము రూ.40 కోట్లను వడ్డీ సహా సింగరేణికి చెల్లించింది.
డోర్లీ ఓపెన్‌కాస్ట్ పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 162.51 హెక్టార్లల్లో సింగరేణి దట్టమైన అడవులను పెంచింది. 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించిన డంపుల మీద మొక్కలు నాటి దట్టమైన అడవిగా మలిచింది. వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం, కోల్బంకర్లు, సీహెచ్‌సీల వద్ద మిస్ట్ స్పేయర్లను ఏర్పాటు చేసింది. ఈపీటీఆర్ఐ సంస్థ ఆడిట్ నిర్వహించి కేంద్రానికి నివేదికను సమర్పించింది. తనిఖీలు పూర్తయ్యాక మరో రూ. 60 కోట్ల డిపాజిట్లు తిరిగి వచ్చే అవకాశముందని సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.