కుట్ర బట్టబయలైంది. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ పన్నాగం పటాపంచలైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను అడ్డుపెట్టి.. బీఆర్ఎస్పై నెపం నెట్టి.. ఇన్నాళ్లూ నీళ్లు ఎత్తిపోయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం బయటపడింది. బరాజుల్లో నీళ్లు నింపవద్దని.. సాగు, తాగు అవసరాలకు నీటిని ఎత్తిపోయవద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందంటూ ఇన్నాళ్లూ అందరి కండ్లకు గంతలు కడుతూ వచ్చిన కాంగ్రెస్ కపటనీతి బయటపడింది. నీటి ఎత్తిపోతలు తమ పరిధి కాదని, దానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎన్డీఎస్ఏ కుండబద్దలు కొట్టింది. కాళేశ్వరుడి సాక్షిగా సర్కార్ అబద్ధాలు.. ప్రాణహిత నీళ్లల్లో నిలువునా మునిగిపోయాయి.
కాళేశ్వరంపై అక్కసుతో, కేసీఆర్ మీద కక్షతో ప్రాజెక్టును పడావు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. పొలాలను ఎండబెట్టింది. సాగు నీళ్లు ఇవ్వాలంటూ రైతు కోరినా, బీఆర్ఎస్ పోరాడినా వినకుండా.. వచ్చిన నీటిని వచ్చినట్టు ఆంధ్రాకు పారించింది. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను బయటపెట్టకుండా ఇన్నాళ్లూ నాటకాలు ఆడిన రేవంత్ ప్రభుత్వం ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. కాళేశ్వరం నీటి ఎత్తిపోతలతో తమకు సంబంధం లేదని, నీళ్లు ఎత్తిపోయవద్దని తామెన్నడూ చెప్పలేదని ఎన్డీఎస్ఏ వెల్లడించింది.
తమది ప్రాజెక్టు నిర్మాణం, భద్రతకు సంబంధించిన సాంకేతిక కమిటీ మాత్రమేనని తేల్చిచెప్పింది. పాలమూరులో నీళ్లు లేవని వాదించిన సర్కార్.. చివరికి వెట్న్ చేపట్టక తప్పలేదు. దేవాదుల మోటర్లు నడపని ప్రభుత్వం.. తుదకు పంపులు ఆన్ చేయక తప్పలేదు. బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే తప్ప సాగునీటి విడుదలకు కదలని ప్రభుత్వమిది. కాలపరీక్షకు నిలిచే తెలంగాణ జీవనరేఖ.. కాళేశ్వరం! కరువును తీర్చే కల్పవల్లి కాళేశ్వరం! మహా సంకల్పం చుట్టూ అల్లుకున్న కుట్రలన్నీ ఏనాటికైనా కూలిపోవాల్సిందే!
హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్‌లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ బరాజ్ గేట్లన్నీ తెరిచిపెట్టాలని సూచించింది. అదీగాక ఒకే రివర్‌బెడ్‌పై నిర్మించిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్లలో మేడిగడ్డ తరహాలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నదని, అక్కడ పరీక్షలు చేయాలని, అప్పటివరకు ఆ బరాజ్‌లను సైతం తెరిచిపెట్టాలని సూచించింది. ఏడాది తర్వాత 2025 ఏప్రిల్‌లో తుది నివేదిక సమర్పించింది. చేయాల్సిన పునరుద్ధరణ పనులపై మార్గదర్శకాలు జారీచేసింది. నివేదిక వచ్చినా ఏడాదిన్నరగా ఆ దిశగా పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ విషయమై ప్రభుత్వాన్ని స్వయంగా ఎన్డీఎస్ఏ చైర్మనే నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని, వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. అంతేకాదు బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు సైతం స్పష్టంచేశారు.
ప్రభుత్వానికి లేఖ రాశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా సర్కార్‌ను ప్రశ్నించారు. అంతేకాదు మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాలను కన్నెపల్లి నుంచి జలాలను ఎత్తిపోసుకోవచ్చని, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో తలెత్తిన సీపేజ్ సమస్యలను గతంలో అరికట్టామని, అవీ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ గత నివేదికలనే సాకుగా చూపుతూ బరాజ్‌లను వినియోగించుకోలేమని, నీటిని ఎత్తిపోసేది లేదని పదేపదే తెగేసి చెబుతున్నది. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా దిగువకు వృథాగా జలాలను వదిలేస్తున్నది. అదీగాక భద్రాచలం మునుగుతుందంటూ అసంబద్ధ వాదనలకు దిగుతున్నది. ఈ క్రమంలో ఇంతకాలం కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని తాజా ఎన్డీఎస్ఏనే వెల్లడించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీనర్సింహ గుప్తా అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానమిచ్చింది.
ఎన్డీఎస్ఏకు ఎన్నారై లేఖ
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ లక్ష్మీనర్సింహ గుప్తా ఇటీవల నేరుగా ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. బరాజ్‌ల వినియోగ అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటని, రాష్ట్రంలో నీటి పారుదల, తాగునీరు, పారిశ్రామిక నీటి సరఫరాను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. దాని పరిమాణం, ప్రాముఖ్యత దృష్ట్యా ప్రాజెక్టుకు సంబంధించి భద్రత, నిర్మాణ పటిష్టత, నిర్వహణ ప్రమాణాలకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసి నిర్ధారించాలని ఎన్డీఎస్ఏను అభ్యర్థించారు. కరువు నేపథ్యంలో ఎత్తిపోతలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం సమస్యలను పరిషరించేదాకా ప్రాజెక్టును వినియోగించలేమని తెగేసి చెబుతున్నదని వివరించారు. మరమ్మతుల సమయంలో ప్రాజెక్టును సురక్షితంగా ఉపయోగించవచ్చా? లేదా? అనే అంశంపై స్పష్టతనివ్వాలని ఎన్డీఎస్ఏను ఆయన అభ్యర్థించారు. సమగ్ర తనిఖీలు నిర్వహించి, ప్రాజెక్ట్ భాగాల నిర్మాణస్థితిని అంచనా వేసి, అవసరమైన చోట తగిన దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేయాలని, తద్వారా రైతులకు సాగునీరు అందుతుందని కోరారు.
ఎత్తిపోతల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..
ఎన్ఆర్ఐ చేసిన మెయిల్‌కు ఎన్డీఎస్ఏ స్పష్టమైన సమాధానమిచ్చింది. కాళేశ్వరం నుంచి నీటిపోతల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమేనని, తమకేమీ సంబంధం లేదని తేల్చిచెప్పింది. డ్యామ్ భద్రతా చట్టం-2021 ప్రకారం ఎన్డీఎస్ఏ స్థాపితమైందని గుర్తుచేసింది. తమ సంస్థ కేవలం డ్యామ్ వైఫల్యం సంబంధిత విపత్తుల నివారణ కోసమే పనిచేస్తుందని, అందులో భాగంగా నిర్దిష్టమైన డ్యామ్‌ల పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, మరమ్మతులు అందించడం, వాటి సురక్షిత పనితీరును నిర్ధారించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, దానికి సంబంధించి అనుబంధ అంశాలపైనే పనిచేస్తుందని వివరించింది. తమ ప్రాథమిక దృష్టి ప్రత్యేకంగా డ్యామ్‌లు, బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టతపై మాత్రమే ఉంటుందని ఎన్డీఎస్ఏ తెలిపింది. ఆయా ప్రాజెక్టుల ప్రణాళికకు సంబంధించి అంటే నీటిని ఎకడ, ఏ వినియోగం కోసం తీసుకోవాలనే కార్యాచరణ నిర్ణయాలు తమపరిధిలోకి రాబోవని తేల్చిచెప్పింది.
సాగునీటి కోసం, కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన అంశాలేనని స్పష్టంచేసింది. మేడిగడ్డబరాజ్, అనుబంధనిర్మాణాల భద్రత, పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీలో ఎన్డీఎస్ఏ సాంకేతిక సభ్యుడు నేతృత్వం వహిస్తున్నారని, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో పాటు సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్‌స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) తదితర సంస్థ ల నిపుణులు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేసింది. కాళేశ్వరం నుంచి రైతులకునీటిని పంపి ంగ్ చేయాలా? వద్దా? అనే కార్యనిర్వహణ, విధానపరమైననిర్ణయాల్లో ఎస్డీఎస్ఏకు ఎలా ంటి పాత్ర లేదని సమాధానమిచ్చింది. నీటి వినియోగ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, ప్రాజెక్టు ద్వారా ఆశించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికే ఉంటుందని ఎన్డీఎస్ఏ నొక్కిచెప్పింది.వెరసి ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది.
మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లు తెరిచిపెట్టాలని ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికలో వెల్లడించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పరీక్షలు, పునరుద్ధరణ పనులన్నీ పూర్తిచేసిన తర్వాత బరాజ్‌లను వినియోగిస్తాం. అప్పటివరకు నీళ్లు ఎత్తిపోసేది లేదు. అయినా నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేయడం తప్పుదోవ పట్టించడమే. బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలకు కేంద్రం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేసింది. బరాజ్‌ల పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలివ్వడంతోపాటు విచారణలు, నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఏమైనా మార్పులు చేస్తే ఆ కమిటీకి తప్పనిసరిగా తెలియజేయాలి. ప్రభుత్వం ఆ సూచనల మేరకే ముందుకు సాగుతుంది. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు, ఇప్పుడు ఈటల రాజేందర్ సైతం నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. బరాజ్‌ల్లో నీళ్లను నింపేందుకు ఎన్డీఎస్ఏను ఒప్పించాలి. ఆ బాధ్యత ఈటల తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొస్తుంది. – ఇవి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు
కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చెబుతున్న మాటలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ సాకుతో రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పడావు పెడుతున్నదని స్పష్టమైంది. తాజాగా ఎన్డీఎస్ఏ వెల్లడించిన విషయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ ప్రచారమంతా వట్టి బూటకమని తేల్చిపారేసింది. తాము కేవలం ఆనకట్టలు, బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టతపైనే దృష్టిసారిస్తామని స్పష్టంచేసింది. ప్రాజెక్టుల ప్రణాళిక, నీటిని ఎకడినుంచి, ఏ ప్రయోజనం కోసం వినియోగించాలనే అంశాలు తమ పరిధిలోకి రాబోవని, ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో సాగు, తాగునీటి కోసం కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఎన్డీఎస్ఏ ఘంటాపథంగా తెలిపింది. రాతపూర్వకంగా సమాధానమిచ్చింది.
ఎవరీ రాకేశ్ తోతేజా?
ప్రస్తుతం ఎన్డీఎస్ఏలో సభ్యుడిగా, విపత్తు నిర్వహణ శాఖలో కీలక అధికారిగా కొనసాగుతున్న రాకేశ్ తోతేజా యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసులకు చెందిన 2000 బ్యాచ్ అధికారి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఏఎమ్ఐఈ ఎగ్జామ్‌లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించడంతో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్’ ప్రైజ్ లభించింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖతోపాటు ప్రభుత్వానికి చెందిన కీలక శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. దేశంలోని నీటి వనరుల అభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు చేశారు. భారత్‌లోనే కాకుండా భూటాన్, నేపాల్‌లో కూడా హైడ్రోపవర్, లిఫ్ట్ ఇరిగేషన్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక భూమిక పోషించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో మా పాత్రేమీ లేదు. బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనాల రీత్యా.. రైతులకు నీళ్లు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
– లిఖితపూర్వక సమాధానంలో ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేశ్ తోతేజా

ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు ఎన్నారై లక్ష్మీనర్సింహగుప్తా రాసిన లేఖ

ఎన్నారై లక్ష్మీనర్సింహగుప్తాకు ఎన్డీఎస్ఏ రాసిన లేఖ