హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని మోటర్లను ఆన్‌చేసి, నీళ్లు ఎత్తిపోసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతించాలంటూ కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నదంతా బూటకమని తేలిపోయిందని చెందిన ఎన్నారై లక్ష్మీనర్సింహగుప్తా తీర్థాల పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్న ఖమ్మం జిల్లా ముచ్చర్లకు చెందిన లక్ష్మీనర్సింహగుప్తా తనకు, ఎన్డీఎస్ఏకు మధ్య జరిగిన ఈ-మెయిల్ ఉత్తర, ప్రత్యుత్తరాలను ‘నమస్తే తెలంగాణ’కు బుధవారం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ అనుమతి ఇస్తేనే నీళ్లు ఎత్తిపోస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని గత జూలై 10న తాను ఎన్డీఎస్ఏకు ఈ-మెయిల్ చేసినట్టు తెలిపారు. దీనికి స్పందించిన ఎన్డీఎస్ఏ.. నీరందించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తనకు జవాబు ఇచ్చిందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, నిర్వహణ అధికారం ఆయా రాష్ర్టాల పరిధిలోనిదేనని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని తెలిపారు.
నీళ్లను ఎలా వాడుకోవాలో, ఎల్ నినో, కరువు పరిస్థితుల్లో ఎంత మేరకు నీళ్లను వాడుకోవాలన్న నిర్ణయాలను ఎన్డీఎస్ఏ తీసుకోదని, రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసిందని పేర్కొన్నారు. మేడిగడ్డ విషయంలో తాము ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని ఎన్డీఎస్ఏ పంపిన లేఖలో పేర్కొన్నదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఎన్డీఎస్ఏను సంప్రదించి ఉంటే ఇప్పుడు తనకు చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పేదని వ్యాఖ్యానించారు. నీటి నిర్వహణకు సంబంధించి ఎన్డీఎస్ఏ జోక్యం ఏమీ ఉండదని తనకు పంపిన లేఖలో చెప్పారని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బదనాం చేయాలని, ప్రజలకు నీళ్లు అందకుండా చేయాలన్న కుట్రతోనే కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తడంలేదని విమర్శించారు. ఒకవేళ తాను చెప్తున్నది అబద్ధమని భావిస్తే, ప్రభుత్వం ఎన్డీఎస్ఏను అప్రోచ్ అయిన వివరాలు, అందుకు సంబంధించిన లేఖ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే నీళ్ల ఎత్తిపోతలపై నిర్లక్ష ్యం
కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లను ఎత్తిపోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదని లక్ష్మీనర్సింహగుప్తా ఆరోపించారు. ఇంతకాలం కాళేశ్వరం కూలేశ్వరమంటూ చేసిన ప్రచారం బూటకమని తేలిపోతుందనే కారణంతోనే విస్మరిస్తున్నదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం రైతులు, ప్రజలను బలిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖమ్మంలోని తన ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు రావని, కానీ తెలంగాణ ప్రజల మేలు కోసమే, వాస్తవాలేమిటో తెలుసుకొనేందుకు ఎన్డీఎస్ఏను సంప్రదించానని లక్ష్మీనర్సింహగుప్తా పేర్కొన్నారు. కన్నెపల్లి ద్వారా నీటి ఎత్తిపోతల విషయంలో రిస్క్ ఉంటుందా? లేదా? అనే విషయం నీటిని తరలిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 24 గంటలూ నీళ్ల తరలింపును పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ఏదో కారణంతో, ఎవరిపైనో కక్షతోనే నీళ్లు తరలించే అవకాశాన్ని వదులుకొని కరువును ప్రజల నెత్తిన రుద్దడం బాధాకరమని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసినా, లేదంటే సాగుతోపాటు పారిశ్రామిక, విద్యుత్తు అవసరాలకు నీళ్లివ్వకుంటే ప్రభుత్వం అపఖ్యాతి పాలుకాకతప్పదని హెచ్చరించారు.