వరంగల్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ దెబ్బతో కాంగ్రెస్ సర్కార్‌లో చలనం పుట్టింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరికతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు మూడు ఫేజ్లలోని 10 పంపులకు గాను 9 పంపులను బుధవారం ఆన్చేసింది. ఫేజ్ -1, ఫేజ్-2లో రెండు చొప్పున నాలుగు పంపులు, ఫేజ్-3లో 5 పంపులు ఇలా 9 పంపుల ద్వారా 2,060 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నది. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను పడావుపెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయలేదని, అదే దేవాదులలోని పంప్‌లను ఎందుకు ఆన్ చేయరని ఈ నెల 12న హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆ తెల్లారే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దేవాదులలో పర్యటించారు. దేవాదుల కింద ఉన్న 22 రిజర్వాయర్లు నింపుతామని ప్రకటించిన విష యం తెలిసిందే. దీంతో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల కింద రైతులు వరి అలికారు. నారుమళ్లు సిద్ధం అవుతున్నాయి.
వ్యవసాయ, బోరుబావులున్న చోట నాట్లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా రామప్ప చెరువు తూములను నీటిపారుదలశాఖ మూసేసింది. ఈవిషయాన్ని రామప్ప చెరువు కింది రైతులు కొంతమంది హరీశ్‌రావుకు తమ గోడువెళ్లబోసుకున్నారు. దీంతో మరోసారి ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశం పెట్టి దేవాదుల పంపులను ఆన్ చేయాలని, లేదంటే బీఆర్ఎస్ రైతులకు అండగా నిలిచేందుకు దేవాదులకు వెళ్లి ఆన్ చేస్తుందని హెచ్చరించారు. సరిగ్గా అదేసమయానికి ఉమ్మ డి వరంగల్జిల్లా ఇన్చార్జిమంత్రి పొంగులేటి, మంత్రి పొన్నం హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం. సమావేశానంతరం దేవాదులలోని అన్ని పంపులను ఆన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. మొత్తానికి బీఆర్ఎస్ వెంటబడి, ఒత్తిడితెస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడంలేదని మరోసారి రుజువైందనే చర్చ సాగుతున్నది.
నిలదీస్తేకానీ కదలని దుస్థితి..
రైతుల కష్టాలను దూరం చేయాలని అడిగితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కదిలే పరిస్థితిలేదనే విషయం జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రేవంత్ సర్కార్ కండ్లు తెరిపించే ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం ఉన్నాయి. గోదావరి నీటి వినియోగం కేంద్రంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిలో నీళ్లున్నా రైతులకు కావాలనే సాగునీటి కష్టాలు తెచ్చిపెడుతున్నదని హరీశ్‌రావు ఈ ఏడాది ఫిబ్రవరి 21న దేవాదుల ప్రాజెక్టులో భాగమైన దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించి దుయ్యబట్టారు. ఆ తెల్లారే (ఫిబ్రవరి 22న) దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు వెళ్తే అది బీఆర్ఎస్ సక్సెస్ అయిందనే అభిప్రాయంతో సీఎం రేవంత్‌రెడ్డి దేవాదులలో ప్రాజెక్టు, పంపుల పనితీరుపై సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నదని, ప్రభుత్వం తక్షణం మేల్కొని రైతాంగానికి నీళ్లు ఎత్తిపోయకపోతే తామే వేలాదిగా తరలివచ్చి పంపులను ఆన్ చేస్తామని అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.
9 పంపులు ఆన్ చేసినా పంటకు నీరొచ్చేనా?
బీఆర్ఎస్ వరుస ఒత్తిళ్ల కారణంగా దేవాదులలోని 10 పంపులకు గాను 9 పంపులు ఆన్ అయ్యాయి. బుధవారం సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం) వద్ద గోదావరికి ఇన్‌ఫ్లో 40,200 క్యూసెక్కులు కాగా ఎత్తిపోస్తున్నది 2,060 క్యూసెక్కులు. అంటే 38,140 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. మొత్తానికి ఈ సీజన్లో ఇప్పటివరకు (ఈ నెల 3 నుంచి 22వ తేదీ వరకు) ప్రభుత్వం ఎత్తిపోసింది కేవలం 2.211 టీఎంసీలే. దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లలో 38.16 టీఎంసీలను ఎప్పుడు ఎత్తిపోస్తుంది? ఆ ఎత్తిపోసిన నీళ్లను రిజర్వాయర్లలో నింపి వాటి కింది రైతులకు అందిస్తుందా? అంటే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప చెరువు కింద రైతులకు ‘ఈ సారి నీళ్లివ్వం’ అని నీటిపారుదల శాఖ ఈ చెరువు తూములను బంద్ చేసింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం వల్లే రైతులు వరికి సిద్ధమయ్యారని, భరోసా ఇచ్చినట్టు నీళ్లు ఇస్తే సరే సరి.. లేదంటే సర్కార్‌కు ఉరేనని వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేయడం గమనార్హం.