కొల్లాపూర్, జూలై 22 : పాలమూరు-రంగారెడ్డి లిప్ట్-1లో రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధి కృష్ణానది సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న పంప్‌హౌస్‌లో రెండో బాహుబలి మోటర్ వెట్న్‌న్రు అధికారులు విజయవంతం చేశారు. ఈ నెల 17న అధికారులు రెండో పంప్‌ను డ్రైరన్ చేపట్టారు. అదేరోజు రెండో పంప్ వెట్ రన్ కూడా పూర్తిచేశారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దాదాపు 5 నిమిషాలపాటు రెండో పంప్ నుంచి 0.00096 టీఎంసీల కృష్ణానది నీటిని అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసినట్టు తెలుస్తున్నది. రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసీఆర్ ప్రారంభించిన మొదటి బాహుబలి మోటర్‌తోపాటు, రెండో బాహుబలి మోటర్ కూడా వెట్ రన్ పూర్తయ్యింది. దీంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల నెరవేరుతున్నదని రైతులు సంబుర పడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడో ప్యాకేజీ పనుల్లో జాప్యం జరుగుతుండటం రైతులను కలవర పరుస్తున్నది.